శ్రీః
6 . అక్కుమ్ పులియిన్
(కోయిల్ తిరుమొழி)
తిరు కుఱుఙ్గుడి దివ్యదేశవైభవమును తిరుమంగై ఆళ్వార్ వర్ణించుచున్నారు.
** అక్కుమ్ పులియన్, అదళుమ్ ఉడైయార్, అవరొరువర్
పక్కమ్ నిఱ్కనిన్ఱ, పణ్బర్ ఊర్ పోలుమ్,
తక్క మరత్తిన్, తాழ் శినైయేరి, తాయ్ వాయిల్
కొక్కిన్ పిళ్ళై, వెళ్ళిఱ వుణ్ణుమ్ కుఱుఙ్గుడియే ll 1798
అక్కుమ్ = ఎముకలు; పులియన్ అదళుమ్ = పులిచర్మమును; ఉడైయార్ అవర్ ఒరువర్ = ధరించిన శివుడను ఒక శ్లాఘ్యమైనవానిని; పక్కమ్ నిఱ్క=తనయొక్క కుడిప్రక్కన నుండునట్లు (స్థానమొసగి); నిన్ఱ=వేంచేసియున్న;పణ్బర్=కళ్యాణగుణములు గల సర్వేశ్వరునియొక్క; ఊర్ పోలుమ్ = నివాసస్థలమువలె నున్నది ఏదనగ; కొక్కిన్ పిళ్ళై = కొంగ యొక్క పిల్ల; తక్క మరత్తిన్ = (తాను ఎక్కగల) తగిన ఒక చెట్టు యొక్క; తాழ் శినై ఏరి = క్రిందకు వంగియున్న కొమ్మపై ఎక్కి; వెళ్ళిఱవు ఉణ్ణుమ్ =”వెళ్ళిఱా” జాతికి చెందిన చేపలను తినుచుండెడి; కుఱుఙ్గుడియే = తిరకురుఙ్గుడి దివ్య దేశమే!
ఎముకలు, పులిచర్మమును ధరించిన శివుడను ఒక శ్లాఘ్యమైనవానిని తనయొక్క కుడిప్రక్కన నుండునట్లు(స్థానమొసగి),వేంచేసియున్న కళ్యాణగుణములు గల సర్వేశ్వరునియొక్క నివాసస్థలమువలె నున్నది ఏదనగ, కొంగ యొక్క పిల్ల (తాను ఎక్కగల) తగిన ఒక చెట్టు యొక్క క్రిందకు వంగియున్న కొమ్మపై ఎక్కి”వెళ్ళిఱా” జాతికి చెందిన చేపలను తినుచుండెడి తిరకురుఙ్గుడి దివ్య దేశమే!
తుఙ్గ ఆరరవ, త్తిరై వన్దు ఉలవ, తొడు కడలుళ్
పొఙ్గార్ అరవిల్ తుయిలుమ్, పునిదరూర్ పోలుమ్,
శెఙ్గాల్ అన్నమ్, తిగழ் తణ్ పణైయిల్ పెడైయోడుమ్,
కొఙ్గార్ కమలత్తు, అలరిల్ శేరుమ్ కుఱుఙ్గుడియే ll 1799
తుఙ్గమ్ ఆర్ అరవ = ఉన్నతమైన,మిక్కిలి ఘోషించుచున్న; తిరై వన్దు ఉలవ = అలలు వచ్చి వీచుచుండగ; తొడు కడలుళ్=అగాధమైన పాలసముద్రమున;పొఙ్గు ఆర్ అరవిల్= (ఎడతెగక లభ్యమైన సేవకు) ఉప్పొంగిన పెద్ద శరీరముగల ఆదిశేషునిపై; తుయిలుమ్ = యోగనిద్రలో పవళించియున్న; పునిదర్ = పరమపవిత్రుడైన సర్వేశ్వరునియొక్క; ఊర్ పోలుమ్ = నివాసస్థలమువలె నున్నది ఏదనగ; శెమ్ కాల్ అన్నమ్ = ఎర్రని కాళ్ళుగల హంసలు; తిగழ் తణ్ పణైయిల్ = అందమైన చల్లని నీటిప్రదేశములందు; కొఙ్గు ఆర్ కమలత్తు అలరిల్ = పరిమళ భరితమైన వికసించిన తామర పుష్పములందు; పెడై యోడుమ్ = తమ ఆడ హంసలతో; శేరుమ్ = చేరుచుండెడి; కుఱుఙ్గుడియే = తిరకురుఙ్గుడి దివ్య దేశమే!
ఉన్నతమైన,మిక్కిలి ఘోషించుచున్న అలలు వచ్చి వీచుచుండగ అగాధమైన పాలసముద్రమున, (ఎడతెగక లభ్యమైన సేవకు) ఉప్పొంగిన పెద్ద శరీరము గల ఆదిశేషునిపై యోగనిద్రలో పవళించియున్న పరమపవిత్రుడైన సర్వేశ్వరునియొక్క నివాసస్థలమువలె నున్నది ఏదనగ, ఎర్రని కాళ్ళుగల హంసలు అందమైన చల్లని నీటిప్రదేశములందు పరిమళ భరితమైన వికసించిన తామర పుష్పములందు తమ ఆడ హంసలతో చేరుచుండెడి తిరకురుఙ్గుడి దివ్య దేశమే!
వాழక్కణ్డోమ్, వన్దు కాణ్మిన్ తొణ్డీర్ గాళ్,
కేழల్ శెఙ్గణ్, మాముగిల్ వణ్ణర్ మరువుమ్ ఊర్,
ఏழை చ్చెఙ్గాల్, ఇన్ తుణై నారైక్కిరైతేడి,
కూழை ప్పార్వై, క్కార్ వయిల్ మేయుమ్ కుఱుఙ్గుడియే ll 1800
తొణ్డీర్ గాళ్ = భాగవతులారా!; వాழ కణ్డోమ్ = ఉజ్జీవింపబడుటకు తగు మార్గమును తెలుసుకొంటిమి; కేழల్ = వరాహరూపమున అవతరించినవాడును;శెమ్ కణ్ = ఎర్రని నేత్రములు కలవాడును; మాముగిల్ వణ్ణర్ = కాళమేఘమువంటి వర్ణముగల సర్వేశ్వరుడు; మరువుమ్ ఊర్=ఆశించి వసించెడిస్థలమైన; ఏழை శెమ్ కాల్=మృదువైన ఎర్రని కాళ్ళుగల; ఇన్ తుణై నారైక్కు= ప్రియమైన తనకు సహకరించు మొగకొంగకు; ఇరై తేడి = ఆహారమును వెదకుచు; కూழை పార్వై = కృత్రిమమైన చూపులుగల ఆడకొంగ; కార్ వయిల్ మేయుమ్ = మేఘములచే ఆవరింబడిన పొలములందు సంచరించు చుండెడి; కుఱుఙ్గుడియే = తిరకురుఙ్గుడి దివ్య దేశమును; వన్దు కాణ్మిన్ = వచ్చి సేవించుకొనుడు!
భాగవతులారా! ఉజ్జీవింపబడుటకు తగు మార్గమును తెలుసుకొంటిమి. (అది ఏమనగ). వరాహరూపమున అవతరించినవాడును,ఎర్రని నేత్రములు కలవాడును, కాళమేఘము వంటి వర్ణముగల సర్వేశ్వరుడు ఆశించి వసించెడి స్థలమైన,మృదువైన ఎర్రని కాళ్ళుగల ప్రియమైన తనకు సహకరించు మొగకొంగకు ఆహారమును వెదకుచు, కృత్రిమమైన చూపులుగల ఆడకొంగ, మేఘములచే ఆవరింబడిన పొలములందు సంచరించుచుండెడి తిరకురుఙ్గుడి దివ్య దేశమును, వచ్చి సేవించుకొనుడు!
శిరమునైన్దు మైన్దుమ్, శిన్దచ్చెన్ఱు, అరక్కన్
ఉరముమ్ కరముమ్ తుణిత్త, ఉరవోన్ ఊర్ పోలుమ్,
ఇరవుమ్ పగలుమ్, ఈన్ తేన్ మురల, మన్ఱెల్లామ్
కురవిన్ పూవేతాన్, మణనాఱుమ్ కుఱుఙ్గుడియే ll 1801
మున్ = మునుపొకకాలమున; అరక్కన్ = అసురుడు రావణాసురునియొక్క; శిరమ్ ఐన్దుమ్ ఐన్దుమ్ = పది తలలును; శిన్ద = శిథిలమగునట్లు; శెన్ఱు=లంకాపురికి వేంచేసి;ఉరముమ్ కరముమ్=(అతనియొక్క) వక్షస్థలము,చేతులను; తుణిత్త = ఖండించిన, ఉరవోన్ = శక్తివంతుడైన సర్వేశ్వరుని యొక్క;ఊర్ పోలుమ్=నివాసస్థలమువలె నున్నది ఏదనగ; ఇరవుమ్ పగలుమ్=రాత్రింపగళ్లు; తేన్=భ్రమరములు; ఈన్=ఇంపుగ;మురల = ఝంకారము చేయుచుండునదియు;మన్ఱు ఎల్లామ్=బాహ్య ప్రదేశములంతటను; కురవిన్ పూవే తాన్ = “కురవ” పుష్పములు;మణ నాఱుమ్ = పరిమళము వెదజల్లుచుండెడి; కుఱుఙ్గుడియే = తిరకురుఙ్గుడి దివ్య దేశమే!
మునుపొకకాలమున, అసురుడు రావణాసురునియొక్క పది తలలును శిథిలమగునట్లు, లంకాపురికి వేంచేసి (అతనియొక్క) వక్షస్థలము,చేతులను ఖండించిన, శక్తివంతుడైన సర్వేశ్వరుని యొక్క నివాసస్థలమువలె నున్నది ఏదనగ, రాత్రింపగళ్లు భ్రమరములు ఇంపుగ ఝంకారము చేయుచుండునదియు, బాహ్య ప్రదేశములంతటను “కురవ” పుష్పములు పరిమళము వెదజల్లుచుండెడి తిరకురుఙ్గుడి దివ్య దేశమే!
కవ్వై క్కళిర్ట్రు మన్నర్ మాళ, క్కలి మాన్ తేర్
ఐవర్ క్కాయ్, అన్ఱు అమరిల్ ఉయ్ త్తానూర్ పోలుమ్,
మైవైత్తు ఇలఙ్గు, కణ్ణార్ తఙ్గళ్ మొழிయొప్పాన్,
కొవ్వై క్కనివాయ్, క్కిళ్ళై పేశుమ్ కుఱుఙ్గుడియే ll 1802
అన్ఱు=మునుపొకకాలమున; అమరిల్=మహాభారతయుద్దమున;కవ్వై కళిఱు మన్నర్= ఘీంకారము చేయుచున్న ఏనుగులయొక్క సేనలుగల రాజులు;మాళ = మరణించునట్లు; ఐవర్ క్కు ఆయ్ = పంచ పాండవుల కొరకు;కలి మాన్ తేర్=దృఢమైన పెద్ద రథమును;ఉయ్ త్తాన్=నడిపించిన సర్వేశ్వరుని యొక్క; ఊర్ పోలుమ్=నివాసస్థలమువలె నున్నది ఏదనగ; కొవ్వై కనివాయ్ = దొండపండువలె ఎర్రనైన నోరుగల;కిళ్ళై=చిలుకలు; మైవైత్తు ఇలఙ్గు కణ్ణార్ తఙ్గళ్ మొழி ఒప్పాన్ = కాటుక పెట్టుకొన్న మెరయుచున్న నేత్రములుగల యువతుల మాటలు ఒప్పునట్లు; పేశుమ్ = మాటలాడుచుండెడి; కుఱుఙ్గుడియే = తిరకురుఙ్గుడి దివ్య దేశమే!
మునుపొకకాలమున మహాభారతయుద్దమున ఘీంకారముచేయుచున్న ఏనుగులయొక్క సేనలుగల రాజులు మరణించునట్లు, పంచపాండవుల కొరకు దృఢమైన పెద్ద రథమును నడిపించిన సర్వేశ్వరునియొక్క నివాసస్థలమువలె నున్నది ఏదనగ, దొండపండువలె ఎర్రనైన నోరుగల చిలుకలు, కాటుక పెట్టుకొన్న, మెరయుచున్న నేత్రములు గల యువతుల మాటలు ఒప్పునట్లు మాటలాడుచుండెడి తిరకురుఙ్గుడి దివ్య దేశమే!
తీ నీర్ వణ్ణ, మామలర్ కొణ్డు విరైయేన్ది,
తూ నీర్ పరవి, త్తొழுమిన్ ఎழுమిన్ తొణ్డీర్ గాళ్,
మా నీర్ వణ్ణర్, మరువి ఉఱైయుమిడమ్, వానిల్
కూ నీర్ మదియై, మాడమ్ తీణ్డుమ్ కుఱుఙ్గుడియే ll 1803
తొణ్డీర్ గాళ్ = భాగవతులారా!; తూ నీర్ = పరిశుద్ద జలములు;తీ=(ధూప,దీపములకై) అగ్నియును; నీర్=(అర్ఘ్యమునకై)జలమును;వణ్ణ మా మలర్=పలువర్ణములు కలిగిన పుష్పములును; విరై = పరిమళ ద్రవ్యములును; ఏన్ది కొణ్డు = తీసుకొనివచ్చి; పరవి = (సర్వేశ్వరుని)స్తుతించి; తొழுమిన్ = సేవించుకొనుడు; ఎழுమిన్ = ఉజ్జీవింపుడు; (ఎటులనగ)వానిల్=ఆకాశమున;కూ నీర్=పెరుగుటయే స్వభావముగల; మదియై=చంద్రవంకను; తీణ్డుమ్ మాడమ్ = స్పర్శించుచుండు భవనములుగల; కుఱుఙ్గుడియే = తిరుకురుఙ్గుడి దివ్య దేశమున; మా నీర్ వణ్ణర్=మహాసముద్రమువంటి వర్ణముగల సర్వేశ్వరుడు;మరువి ఉఱైయుమ్ ఇడమ్ = చేరి నిత్యవాసము చేయుచున్న స్థలమునసుమా!
భాగవతులారా! పరిశుద్ద జలములు, (ధూప,దీపములకై)అగ్నియును, ( అర్ఘ్యమునకై ) జలమును, పలువర్ణములు కలిగిన పుష్పములును, పరిమళ ద్రవ్యములును, తీసుకొనివచ్చి(సర్వేశ్వరుని) స్తుతించి సేవించుకొనుడు, ఉజ్జీవింపుడు. (మనకు), ఆకాశమున పెరుగుటయే స్వభావముగల చంద్రవంకను స్పర్శించుచుండు భవనములుగల,తిరుకురుఙ్గుడి దివ్య దేశమున, మహాసముద్రమువంటి వర్ణముగల సర్వేశ్వరుడు చేరి నిత్యవాసము చేయుచున్న స్థలము కలదుసుమా!
వల్లిచ్చిరు నుణ్ ఇడై యారిడై, నీర్ వైక్కిన్ఱ,
అల్లల్ శిన్దై తవిర, అడైమిన్ అడియీర్ గాళ్,
శొల్లిల్ తిరువే యనైయార్, కనివాయ్ ఎయిఱొప్పాన్,
కొల్లై ముల్లై, మెల్ అరుమ్బు ఈనుమ్ కుఱుఙ్గుడియే ll 1804
అడియీర్ గాళ్ = భగవద్భక్తులారా!; నీర్ = మీరు; వల్లి శిరు నుణ్ ఇడైయార్ ఇడై = తీగవంటి మిక్కిలి సూక్ష్మమైన నడుముగల యువతుల యందు;వైక్కిన్ఱ=ఉంచుకొనిన;అల్లల్ శిన్దై తవిర=దుఃఖభాజకమైన మనస్సును పోవునట్లు;కొల్లై ముల్లై = పెరటిలోగల సన్నజాజుతీగలు ; శొల్లిల్ తిరువే అనైయార్= వాక్కులలో శ్రీమహాలక్ష్మిని ఒప్పుయువతుల; కనివాయ్ = దొండపండువలె ఎర్రనైన నోటిలోగల; ఎయిఱు ఒప్పాన్=పళ్ళతో ఒప్పు; మెల్ అరుమ్బు = అందమైన మొగ్గలను; ఈనుమ్=పుష్పించుచుండెడి; కుఱుఙ్గుడియే = తిరకురుఙ్గుడి దివ్య దేశమునే; అడైమిన్ = చేరుకొనుడు!.
భగవద్భక్తులారా! మీరు తీగవంటి మిక్కిలి సూక్ష్మమైన నడుముగల యువతుల యందు ఉంచుకొనిన దుఃఖభాజకమైన మనస్సును పోవునట్లు,పెరటిలోగల సన్నజాజుతీగలు, వాక్కులలో శ్రీమహాలక్ష్మిని ఒప్పుయువతుల దొండపండువలె ఎర్రనైన నోటిలోగల పళ్ళతో ఒప్పు,అందమైన మొగ్గలను పుష్పించుచుండెడి తిరకురుఙ్గుడి దివ్య దేశమునే చేరుకొనుడు!.
నారార్ ఇణ్డై, నాణ్ మలర్ కొణ్డు నమ్ తమర్ గాళ్,
ఆరా అన్బోడు, ఎమ్బెరుమాన్ ఊర్ అడైమిన్ గళ్,
తారా ఆరుమ్, వార్ పునల్ మేయ్ న్దు వయల్ వాழுమ్,
కూర్ వాయ్ నారై, పేడైయోడాడుమ్ కుఱుఙ్గుడియే ll 1805
నమ్ తమర్ గాళ్ = మాతోచేరియున్న భగవద్భక్తులారా!; నార్ ఆర్ ఇణ్డై = దారమందు దగ్గర దగ్గరగా గుచ్చబడిన పుష్పముల మాలలను; నాళ్ మలర్ = అప్పుడే వికసించిన పుష్పములను; కొణ్డు = తీసుకొని వచ్చి;ఆరా అన్బోడు=పరమ భక్తితో;ఎమ్బెరుమాన్= సర్వేశ్వరునియొక్క; ఊర్=నివాస స్థలమును; అడైమిన్ గళ్ = చేరుకొని సేవించుడు (అది ఏదనగ); తారా=సారస పక్షులు;ఆరుమ్ = దగ్గర చేరి యుండెడి;వార్ పునల్ = పెద్ద పెద్ద నీటి ప్రదేశములందు; మేయ్ న్దు = ఆహారమును తినుచు; వయల్ = పోలములలో; వాழுమ్ =నివసించెడి; కూర్ వాయ్ నారై =క్రూరముగ శబ్దించుచున్న నారపక్షులు; పేడైయోడు = ఆడ పక్షులతోకూడి; ఆడుమ్=సంతోషముతో సంచరించెడి; కుఱుఙ్గుడియే = తిరకురుఙ్గుడి దివ్య దేశమే!.
మాతోచేరియున్న భగవద్భక్తులారా! దారమందు దగ్గర దగ్గరగా గుచ్చబడిన పుష్పముల మాలలను, అప్పుడే వికసించిన పుష్పములను తీసుకొని వచ్చి పరమ భక్తితో సర్వేశ్వరుని యొక్క నివాస స్థలమును చేరుకొని సేవించుడు (అది ఏదనగ) సారస పక్షులు, దగ్గర చేరి యుండెడి పెద్ద పెద్ద నీటి ప్రదేశములందు ఆహారమునుతినుచు, పొలములలో నివసించెడి క్రూరముగ శబ్దించుచున్న నారపక్షులు, ఆడ పక్షులతోకూడి సంతోషముతో సంచరించెడి తిరకురుఙ్గుడి దివ్య దేశమే!.
నిన్ఱ వినైయుమ్ తుయరుమ్ కెడ, మామలర్ ఏన్ది,
శెన్ఱు పణిమిన్ ఎழுమిన్, తొழுమిన్ తొణ్డీర్ గాళ్,
ఎన్ఱుమ్ ఇరవుమ్ పగలుమ్, వరి వణ్డిశైపాడ,
కున్ఱిల్ ముల్లై, మన్ఱిడై నాఱుమ్ కుఱుఙ్గుడియే ll 1806
తొణ్డీర్ గాళ్ = భగవద్భక్తులారా!; నిన్ఱ వినైయుమ్=సంచితకర్మములు;తుయరుమ్ = ప్రారబ్ధ కర్మములు; కెడ = నశించునట్లు; మా మలర్ ఏన్ది = శ్లాఘ్యమైన పుష్పములను తీసుకొని; ఇరవుమ్ పగలుమ్ ఎన్ఱుమ్=రాత్రింపగళ్లు ఎల్లప్పుడును;వరి వణ్డు ఇశైపాడ=అందమైన రేకలు గల భ్రమరములు రాగభరితముగ ఝంకారము చేయుచుండగ;కున్ఱిల్ ముల్లై = కొండలలోని మల్లెపుష్పములు; మన్ఱిడై= బాహ్యప్రదేశములంతటను;నాఱుమ్=పరిమళము వెదజల్లుచుండెడి; కుఱుఙ్గుడియే = తిరకురుఙ్గుడి దివ్య దేశమే!; శెన్ఱు పణిమిన్ =చేరి స్తుతించుడు;తొழுమిన్= సేవించుకొనుడు;ఎழுమిన్=ఉజ్జీవింపుడు!
భగవద్భక్తులారా! సంచితకర్మములు, ప్రారబ్ధ కర్మములు నశించునట్లు శ్లాఘ్యమైన పుష్పములను తీసుకొని రాత్రింపగళ్లు ఎల్లప్పుడును, అందమైన రేకలు గల భ్రమరములు రాగభరితముగ ఝంకారము చేయుచుండగ, కొండలలోని మల్లె పుష్పములు బాహ్య ప్రదేశములంతటను పరిమళము వెదజల్లు చుండెడి తిరకురుఙ్గుడి దివ్య దేశమే చేరి స్తుతించుడు, సేవించుకొనుడు,ఉజ్జీవింపుడు!
** శిలైయాల్ ఇలఙ్గై శెర్ట్రాన్, మర్ట్రోర్ శినవేழమ్,
కొలైయార్ కొమ్బుకొణ్డాన్, మేయ కుఱుఙ్గుడిమేల్,
కలైయార్ పనువల్ వల్లాన్, కలియన్ ఒలిమాలై,
నిలైయార్ పాడల్ పాడ, ప్పావమ్ నిల్లావే ll 1807
శిలైయాల్ = శారంగం విల్లుచే; ఇలఙ్గై శెర్ట్రాన్ = లంకాపురిని నాశనముచేసినవాడును; మర్ట్రు = మరియు; శినమ్ = మిక్కిలి క్రోధించియున్న;ఓర్ వేழுమ్=కువలయాపీడమను ఒక ఏనుగుయొక్క; కొలైయార్ = తునుమెడి స్వభావముగల, కొమ్బు= దంతములను; కొణ్డాన్ = పెరికి సంహరించిన సర్వేశ్వరుడు;మేయ కుఱుఙ్గుడి మేల్ = నిత్యవాసము చేయుచున్న తిరుకురుఙ్గుడి దివ్యదేశ విషయమై; కలైయార్ పనువల్ వల్లాన్=శాస్త్రోక్త లక్షణములతో కూడిన కవితలు పాడగల సామర్ధ్యము కలిగిన; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; ఒలి మాలై = అనుగ్రహించిన సూక్తులమాలను; నిలై ఆర్ పాడల్ = ఉన్నత భావములతో నిండిన (వేదరూపమైన) ఈ దివ్య పాశురములను; పాడ = పాడినచో; పావమ్ నిల్లావే = పాపములు నిలువలేవు!.
శారంగం విల్లుచే లంకాపురిని నాశనముచేసినవాడును,మరియు మిక్కిలి క్రోధించియున్న కువలయాపీడమను ఒక ఏనుగుయొక్క తునుమెడి స్వభావముగల దంతములను పెరికి సంహరించిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న తిరుకురుఙ్గుడి దివ్యదేశ విషయమై శాస్త్రోక్తలక్షణములతో కూడిన కవితలు పాడగల సామర్ధ్యముకలిగిన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన సూక్తులమాలను, ఉన్నత భావములతో నిండిన (వేదరూపమైన) ఈ దివ్య పాశురములను పాడినచో పాపములు నిలువలేవు!.
*****