శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
అవతారిక :-
ఈలోకమందుగల అఙ్ఞానాందకారము తొలగించుటకై అవతరించిన ఆళ్వారులులో ప్రముఖులైన నమ్మాళ్వార్ అందమైన తమిళ భాషలో అనుగ్రహించిన చతుర్వేదసారమైన నాలుగు దివ్య ప్రబంధములకును ఆరుఅంగములగ తిరుమంగై ఆళ్వార్ల ముఖపద్మమునుండి వెలువడిన ఆరు దివ్య ప్రబంధములలో ఒకటి ఈ తిరుక్కుఱున్దాడకమ్. ఇది తమిళ భాషలో పద్యరచనలో ఒక శైలి. ఇందు ప్రతి పాశురము , నాలుగు చరణములు, ప్రతి చరణము ఆరు పదములతో , 15 అక్షరములకు పైనను 26 అక్షరములను మించకుండగను కలిగియుండును. అటువంటి శైలిగల ఈ ప్రభంధ పఠనము భక్తులను ఒక ఉచ్ఛమైన స్థితికి చేకొనిపోవు కారణముచే, ఈ ప్రబంధము, తిరుక్కుఱున్దాడకమ్ నామధేయముతో విలసిల్లుచున్నది.
శ్రీ మన్నారాయణుని పరమ కృపచే తిరుమంత్రము ఉపదేశింపబడిన తిరుమంగై ఆళ్వారులు ,ఆ మంత్ర ధ్యానమందు మగ్నులై,పరిపూర్ణమైన భక్తిపారవశ్యముతో 86 దివ్యదేశములను స్వయముగ దర్శించి మంగళాశాసనము చేసిరి.(అదియే మొదటి ప్రబంధమైన పెరియతిరుమొழி). సంసారబంధము, జన్మపునరావృతమను కూపమునుండి విముక్తికై శ్రీమన్నారాయణుని గద్గద కంఠముతో ఎలుగెత్తి వేడుకొనిరి. భక్తులకు , తిరుమంగై ఆళ్వార్ల ద్వారా విశేష ఙ్ఞానమును కలిగింపజేయనెంచి పెరుమాళ్ తటస్థముగనుండి, తమ కళ్యాణగుణములను ప్రకాశింపజేసిరి. ఆత్మగుణపరిపూర్ణులైన తిరుమంగై ఆళ్వారులు, తాను అనుభవించిన శ్రీమన్నారాయణుని రక్షకత్వము, భక్తవాత్సల్యము మొదలగు కళ్యాణగుణములను ఈ ( రెండవ ప్రబంధమైన ) తిరుక్కుఱున్దాడకమ్ ద్వారా అనుగ్రహించిరి.
మొదటి మూడుపాశురములలో తిరుమంగై ఆళ్వారులు త్రికరణములతో శ్రీమన్నారాయణుని సేవించుకొని, పెరుమాళ్ పాదారవిందములను విడువను, విడువలేనని తమ దృఢమైన మనోభావములను వెలిబుచ్చుచున్నారు.
** నిదియనై ప్పవళత్తూణై , నెఱిమైయాల్ నినైయ వల్లార్ ,
కదియనై క్కఞ్జన్ మాళ , కణ్డు మున్ అణ్డమాళుమ్ ,
మదియనై మాలై వాழ்త్తి , వణఙ్గి ఎన్ మనత్తు వన్ద ,
విదియనై క్కణ్డుకొణ్డ , తొణ్డనేన్ విడుకిలేనే ll . 2032
నిదియనై = (భక్తులకు ) నిధి వలె నుండు వాడును; పవళ తూణై = పవళమువలె స్పృహణీయముగాను , ఆధారముగ నుండు స్తంభమువలె ,ఆశ్రయించిన వారి భారము వహించువాడును; నెఱిమైయాల్ నినైయ కదియనై = ఏదైన ఒక యోగమార్గము ద్వారా చింతించువారికి పరమగతిగ నుండు వాడును; మున్ = పూర్వము ఒకప్పుడు; కఞ్జన్ మాళ కణ్డు = కంసుడు నశించునట్లు చేసి; అణ్డమ్ = లోకములను; ఆళుమ్ =రక్షించినవాడును;మదియనై =(తన దివ్య పాదారవిందములను ఆశ్రయించి యుండువారిని) ఎల్లప్పుడును తలచువాడును; మాలై = ఆశ్రితులయందు అమిత వ్యామోహము కలిగియుండువాడును; వాழ்త్తి,వణఙ్గి,ఎన్ మనత్తు వన్ద, విదియనై=నేను మంగళాశాసనముచేసి,సేవించుకొనుటకు అనుకూలముగా నా మనస్సుయందు వేంచేసిన నా భాగ్యస్వరూపమైన శ్రీమన్నారాయణుని, క్కణ్డుకొణ్డ = సేవించుకొన్న; తొణ్డనేన్ = దాసుడైన నేను; విడుకిలేనే = (ఇక ఒక క్షణమైనను) విడువను.
గుప్తమైన నిధిని కనుగొనినవాడు దానిని ఎల్లవేళల బహు జాగరూకతతో కాపాడుకొనుచును, దానిని విడువక అనుభవించుచు మహదానందముతో నుండునో, అటులనే (ఉపనిషత్తులయందు పేర్కొనిన విధముగ) భక్తుల హృదయమందు అట్టి నిధిగ నుండు వాడును , ఆశ్రితుల భారమును తాను వహించుచు మిక్కిలి ఆహ్లాదము నొసుగువాడును, యోగులకు పరమగతిగ నుండు వాడును, కంసుడు మొదలగు రాక్షసులను తుదముట్టించి లోకములను రక్షించినవాడును, ఆశ్రితులయందు అమిత వ్యామోహము కలిగియుండువాడును, నేను స్తుతించి, సేవించికొనుటకు అనువుగా నా మనస్సులో కృపతో వేంచేసిన సర్వేశ్వరుని పాదపద్మములను దాసుడైన నేను ఎన్నడును విడువను.
కార్ట్రినై ప్పునలై త్తీయై , క్కడి మదిళ్ ఇలఙ్గై శెర్ట్ర
ఏర్ట్రినై , ఇమయమేయ , ఎழிల్ మణిత్తిరళై , ఇన్బ
వార్ట్రినై అముదన్దన్నై , అవుణన్ ఆరుయిరై ఉణ్డ
కూర్ట్రినై , గుణఙ్కొణ్డు ఉళ్ళమ్ , కూఱు నీకూఱు మాఱే ll 2033
కార్ట్రినై పునలై తీయై = వాయువు, నీరు , అగ్ని మొదలగు పంచభూతములచే నిండిన లోకములను తన శరీరముగ కలవాడును; కడి మదిళ్ ఇలఙ్గై శెర్ట్ర ఏర్ట్రినై = పలు ప్రాకారములు రక్షణముగ కలిగిన లంకాపురిని ధ్వంసముచేసిన మహాపరాక్రమశాలియును; ఇమయమ్ మేయ = హిమవంతపర్వతముపై (తిరుపిరిది దివ్యదేశములో) వేంచేసిన వాడును; ఎழிల్ మణి తిరళై = అందమైన నీల రత్నముల సమూహములవలె అతి సుందరమైన విగ్రహస్వరూపుడును; ఇన్బమ్ ఆర్ట్రినై = ఆనంద సముద్రుడుగ నుండువాడును ; అముదమ్ తన్నై = భక్తులకు అమృతమువలె భోగ్యుడును; అవుణన్ = (హిరణ్యాసురునియొక్క) అశురునియొక్క; ఆర్ ఉయిరై ఉణ్డ = ప్రియమైన ప్రాణమును హరించిన ; కూర్ట్రినై =మృత్యువైన సర్వేశ్వరుని; ఉళ్ళమే=ఓ నామనసా!;గుణమ్ కొణ్డు =కల్యాణ గుణములను; కూఱు = అనుసంధిచుటకు చూడుమా! (అని బోధించగ, తాను చెప్పిన విధముగ అనుసంధిచుచున్న మనస్సును గాంచి) , నీ కూఱుమ్ ఆఱే = తన మనస్సు అనుసంధించుటను సరిచూసుకొని అబ్బురపడుచున్నారు.
పంచభూతమయమయిన జగత్తును శరీరముగ కలవాడును, పలు ప్రాకారములచే రక్షింపబడు లంకాపురిని ధ్వంసముచేసిన మహాపరాక్రమశాలియును, తిరుపిరిది దివ్యదేశములో కృపతోవేంచేసిన వాడును, నీలమణుల కాంతితో ప్రకాశించు విగ్రహస్వరూపుడును, ఆనందసముద్రుడును, అమృతతుల్యుడును, హిరణ్యాసురుని విశాలవక్షస్ధలమును చీల్చివధించిన ఉగ్రనరసింహుడును, అట్టి సర్వేశ్వరుని కళ్యాణ గుణములను ఓ! నామనసా! అనుసంధించుమా! అని బోధించగ, తాను చెప్పిన విధముగ అనుసంధిచుచున్న మనస్సును గాంచి అచ్చెరువొందినారు.
పాయ్ ఇరుమ్ పరవైతన్నుళ్ , పరువరై తిరుత్తి , వానోర్కు
ఆయిరున్దు అముదఙ్గొణ్డ , అప్పనై యెమ్బిరానై ,
వేయ్ ఇరుమ్ శోలై శూழ்న్దు , విరికదిర్ ఇరియనిన్ఱ ,
మాయిరుఞ్జోలైమేయ , మైన్దనై వణఙ్గినేనే . 2034
పాయ్ ఇరుమ్ పరవైతన్నుళ్=విశాలమైనదియు;మిక్కిలి అగాధమైనదియు అయిన పాలసముద్రములో; పరు వరై = పెద్ద (మందర) పర్వతమును; తిరిత్తు = త్రిప్పి (సముద్రమును చిలికి); వానోర్కు ఆయ్ ఇరున్దు = దేవతలయందు పక్షపాతియై యుండి;అముదమ్ కొణ్డ = అమృతమును తీసి కృపతో దేవతలకు ఒసగిన; అప్పనై = ఉపకారకుడును; ఎమ్ పిరానై = నాకు స్వామియును; ఇరుమ్ = మిక్కిలి దట్టమైన; వేయ్ శోలై శూழ்న్దు = వెదురు తోటలతో చుట్టుకొనబడి (ఆ కారణముచే); విరి కదిర్ ఇరియ నిన్ఱు = సూర్యుడు కన్నులకు అగోచరముగ నుండు; మాయిరుఞ్జోలై = తిరుమాలిరుఞ్జోలై పర్వతముపై; మేయ = నిత్యవాసము చేయుచు కృపచేయుచున్న; మైన్దనై = సర్వశక్తుడైన సర్వేశ్వరుని; వణఙ్గినేనే = దివ్య చరణములయందు శరణుజొచ్చి ఉజ్జీవించితిని.
విశాలమైన, అగాధమైన పాలసముద్రమును మందర పర్వతము కవ్వముగా చేసుకొని చిలికి , అమృతమును తీసి, జగన్మోహినిగ అవతరించి రాక్షసులను మోహములోపడదోసి, దేవతలకు ఆ అమృతమును ఒసగిన సర్వశక్తుడైన సర్వేశ్వరుడును, నాకు స్వామియును, సూర్యకిరణములు ప్రవేశింపలేనంత దట్టముగ నున్న వెదురుచెట్లతో చుట్టుకొనియున్న తిరుమాలిరుఞ్జోలై దివ్య దేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని పాదపద్మములందు శరణుజొచ్చి ఉజ్జీవించితిని.
ఈ క్రింది నాలుగు , ఐదు పాశురములలో తిరుమంగై ఆళ్వారులు, శ్రీమన్నారాయణుని కల్యాణగుణములు తనకు అమృతతుల్యుమై , ఎంత అనుభవించినను తృప్తితీరక నుండుటచే , అవి అంత భోగ్యముగ నుండుటకు కారణమును తెలియజేయమని సర్వేశ్వరునికి విన్నవించుకొనుచున్నారు.
కేట్క యాన్ ఉర్ట్రదుణ్డు , కేழలాయ్ ఉలగఙ్కొణ్డ ,
పూక్కెழுవణ్ణనారై , ప్పోదర క్కనవిల్ కణ్డు ,
వాక్కినాల్ కరుమన్దన్నాల్ , మనత్తినాల్ శిరత్తైతన్నాల్ ,
వేట్కై మీదూరవాఙ్గి , విழுఙ్గినేఱ్కు ఇనియవాఱే ll 2035
యాన్ = దాసుడైన నేను; కేట్క ఉర్ట్రదు ఉణ్డు = (ఒక విషయము) తెలుసుకొనవలసినది కలదు (బదులు నొసగి కరుణించవలెను); కేழలాయ్ = వరాహరూపముదాల్చి; ఉలగమ్ కొణ్డ = భూమిని అండభిత్తినుండి తన దంతముతో పెగళించి పైకెత్తిన; పూ కెழு వణ్ణణారై = పుష్పమువలె అతి మృదువైన స్వరూపముగల సర్వేశ్వరుని; కనవిల్ = స్వప్నములో ; పోదర కణ్డు = కృపతో వేంచేయగ ; వాక్కినాల్ = వాక్కుల చేతను; కరుమన్ తన్నాల్ = శరీరముచేతను; మనత్తినాల్ = మనస్సుచేతను (త్రికరణములతో ); శిరత్తై తన్నాల్ = శ్రద్ధగా; వేట్కై = నా యొక్క ఆశ; మీదూర = సంపూర్ణముగ తీరునటుల; వాఙ్గి విழுఙ్గినేఱ్కు = పట్టుకొని (మధురాన్నమువలె భుజించి) అనుభవించిన నాకు; ఇనియవాఱే = మిక్కిలి భోగ్యముగ నుండుటకు కారణమును తెలియజేయమా?
వరాహరూపముదాల్చి భూమిని అండభిత్తినుండి పైకెత్తిన, పుష్పమువలె అతి మృదువైన స్వరూపముగల సర్వేశ్వరుడు , తన స్వప్నములో కృపతో వేంచేయగ, త్రికరణములతో శ్రద్ధగ ఆశతీర సేవించికొన్న తిరుమంగై ఆళ్వారులు తాను అనుభవించిన స్థితి మిక్కిలి భోగ్యముగ నుండుటకు కారణమును తెలియజేయమని సర్వేశ్వరునికి విన్నవించుకొనుచున్నారు. (శ్రీమన్నారాయణుని నిర్హేతుకకృప ఎంత ఆనందదాయకమో , బదులు నొసగలేని సర్వేశ్వరుని విషయమును ఆళ్వారులు ఈ పాశురమున వెలిబుచ్చినారు.)
ఇరుమ్బు నన్ఱు ఉణ్డ నీర్ పోల్ , ఎమ్బెరుమానుక్కు , ఎన్దన్
అరుమ్బెఱల్ అన్బుపుక్కిట్టు , అడిమై పూణ్డు ఉయ్ న్దు పోనేన్ ,
వరుమ్ పుయల్ వణ్ణనారై , మరువి ఎన్ మనత్తు వైత్తు ,
కరుమ్బిన్ ఇన్ శాఱుపోల , ప్పరుగినేఱ్కు ఇనియవాఱే ll 2036
ఇరుమ్బు = (బాగుగ కాల్చిన) ఇనుముచేత; నన్ఱు ఉణ్డ = బాగుగ పీల్చబడు; నీర్ పోల్=జలము వలె; ఎమ్బెరుమానుక్కు = సర్వేశ్వరునికి ; ఎన్దన్ = నాయొక్క; అరుమ్ పెఱల్ అన్బుపుక్కిట్టు =(సర్వేశ్వరుని కృపచే ) పొందుటకు దుర్లభమైన ప్రీతిని అతని విషయమై చేసి; అడిమైపూణ్డు = కైంకర్యములను భోగ్యముగ చేసి; ఉయ్ న్దు పోనేన్ = ఉజ్జీవింపబడితిని; (అదియే కాకుండా) వరుమ్ = (తన దాసులు నుండు ప్రదేశములకు వెదకి) వచ్చుచుండు;పుయల్ వణ్ణనారై = మేఘ వర్ణము పోలిన తిరుమేనిగల ఆ సర్వేశ్వరుని; మరువి = సమీపించి; ఎన్ మనత్తు వైత్తు = నా మనస్సుయందు ధ్యానించి; కరుమ్బిన్ ఇన్ శాఱుపోల = చెరకు రసమాధుర్యమువలె ;పరుగి నేఱ్కు = అనుభవంచిన నాకు; ఇనియవాఱే = మిక్కిలి భోగ్యముగ నుండుటకు కారణమును తెలియజేయమా?
నిప్పులో ఎఱ్ఱగా కాల్చబడిన ఇనుము ఏవిధముగ నీటినిగ్రహించి చల్లబడునటుల నేనును నాయొక్క తాపము తీరునటుల సర్వేశ్వరుని విషయమందు ప్రీతియను ఉదకమును సేవించుటచే , కూడని విషయములందు అనురాగముగల నాకు (సర్వేశ్వరుని కృపచే )పొందుటకు దుర్లభమైన భక్తితొ కైంకర్యములను చేసి ఉజ్జీవింపబడితిని. తన భక్తుల వశించు ప్రదేశములను , తానే స్వయముగ వేంచేసియుండు ఆ నీలమేఘశ్యాముని సమీపించి మనస్సులో ధ్యానించి, చెరకు రసమాధుర్యమువలె అనుభవించిన నాకు ఎంత అనుభవించినను తృప్తితీరని నీ కల్యాణగుణములు అంత భోగ్యముగ నుండుటకు కారణమును తెలియజేయమా? (సర్వేశ్వరుడు బదలు నొసగక తటస్థముగనుండిరి)
ఈ ఆరవ పాశురములో , ఏవిధముగ మహాజలధిలో మునిగినవాడు , నీటినిగ్రోలి తన నోటినుండి గాలిబుడగలు వెలువరించుగల సమర్ధుడో, దాని లోతును చెప్ప అసమర్ధడో , అటులనే సర్వేశ్వరుని గుణార్ణవములో మునిగిన భక్తుడు, ఎల్లలేని భగవంతుని విషయమై ఏ విధముగ స్తుతించుగలడని తిరుమంగై ఆళ్వారులు తాము నుడివిన పాశురముల విషయమై చెప్పుచున్నారు.
మూవరిల్ ముదల్వనాయ , ఒరువనై వులగఙ్కొణ్డ ,
కోవినై కుడందై మేయ, కురుమణిత్తిరళై , ఇన్బ
పావినై ప్పచ్చై త్తేనై , ప్పైమ్బొన్నై అమరర్ శెన్ని
ప్పూవినై , పుకழுమ్ తొణ్డర్ , ఎన్ శొల్లి ప్పుకழ் వర్ తామే ll 2037
మూవరిల్ = బ్రహ్మ,రుద్రుడు,ఇంద్రుడు ఈ ముగ్గురుకిని; ముదల్వన్ ఆయ = మూల కారణమైన వాడైన; ఒరువనై = తనతో సమానమైన వాడును , అధికుడు లేని అద్వితీయుడును; ఉలగమ్ కొణ్డ కోవినై = (మహాబలి నుండి) మూడడుగుల నేలను యాచించి విశ్వమంతను కొలిచి స్వీకరించిన స్వామియును; కుడందై మేయ=తిరుకుడందై దివ్య దేశములో నిత్యవాసము చేయుచున్నవాడును; కురుమణిత్తిరళై = శ్లాఘ్యమైన నీలి రత్నముల సమూహములవలె అతి సుందరమైన విగ్రహస్వరూపుడును; ఇన్బ పావినై = ఇంపైన మధురగీతమువలె చెవులకు ఆహ్లాదముగా నుండు వాడును; ప్పచ్చై త్తేనై = నవీనమైన తేనె వలె నాలుకకు మధురముగా నుండు వాడును; పైమ్ పొన్నై = మేలిమి బంగారమువలె అందరిచే ఆశింపబడువాడును; అమరర్ శెన్ని ప్పూవినై = నిత్యశూరులకు శిరోభూషణమైనవాడును అయిన సర్వేశ్వరుని;పుకழுమ్ = స్తుతించుచున్న;తొణ్డర్ తామ్ = భక్తులు; ఎన్ శొల్లి ప్పుకழ் వర్ = ఏమి చెప్పి స్తుతించగలరు?
బ్రహ్మ ,రుద్ర , ఇంద్రాదులకు నిర్వాహకుడును, తనతో సమానమైన వాడును , అధికుడు లేని అద్వితీయుడును, (ఇంద్రునికై) మహాబలి నుండి మూడడుగుల నేలను యాచించి విశ్వమంతను కొలిచి తీసుకున్న స్వామియును, భక్తులను అనుగ్రహించుటకై తిరుకుడందై దివ్య దేశములో నిత్యవాసము చేయుచున్నవాడును,శ్లాఘ్యమైన నీలి రత్నముల సమూహములవలె అతి సుందరమైన విగ్రహస్వరూపుడును, ఇంపైన మధురగీతమువలె చెవులకు ఆహ్లాదముగా నుండు వాడును, నవీనమైన తేనె వలె నాలుకకు మధురముగా నుండు వాడును, మేలిమి బంగారమువలె అందరిచే ఆశింపబడు వాడును, నిత్యశూరులకు శిరోభూషణమైనవాడును అయిన సర్వేశ్వరుని దివ్య చరణములయందు మగ్నులైన భక్తులు, భగవంతుని విషయమై ఏమి చెప్పి స్తుతించగలరు!
ఈ ఏడవ పాశురములో తిరుమంగై ఆళ్వారులు ఎవరు తమ శిరోభూషణమై వెలుగుచున్నారో వెలిబుచ్చుచున్నారు.
ఇమ్మైయై మఱుమైదన్నై , ఎమక్కు వీడాకినిన్ఱ ,
మెయ్ మ్మైయై విరిన్ద శోలై , వియన్ తిరువరఙ్గమేయ ,
శెమ్మైయై క్కరుమై దన్నై , త్తిరుమలై ఒరుమైయానై ,
తన్మైయై నినైవార్ ఎన్దన్, తలైమిశైమన్నువారే ll 2038
ఎమక్కు= మనకు; ఇమ్ మైయై = ఈ లోకములో (జ్ఞానమను) సుఖము నొసగువాడును; మఱుమైదన్నై= పరలోకములో(జ్ఞానమను)సుఖము నొసగువాడును; వీడు ఆగి నిన్ఱ మెయ్ మ్ మై = యధార్ధమైన మోక్షోపాయముగ నుండువాడును; విరిన్ద శోలై = వ్యాపించిన తోటలు కలిగిన; వియన్=గొప్పదైన; తిరువరఙ్గమేయ = శ్రీరంగమందు నిత్యవాసము చేయువాడును; శెమ్ మైయై కరుమై తన్నై = ఒక్కొక్క యుగములో ఒక్కొక్క వర్ణముగల తిరుమేనితో (కృతయుగములో తెల్లని పాలవలెను, త్రేతాయుగములో ఎఱ్ఱని వర్ణముతోను, ద్వాపరయుగములో ఆకుపచ్చని వర్ణముతోను , కలియుగములో నల్లని మేఘమువంటి వర్ణముతోను) ఆ యుగమందు భక్తులకు కృపజేయువాడును; తిరుమలై = శ్రీ వేంకటాద్రిపై కృపతో వేంచేసి; ఒరుమైయానై = (భూలోక వాసులకును ; పరమపద వాసులకును) ఇరువురికిని సేవాభాగ్యము నొసగువాడును, అట్టి సర్వేశ్వరుని; తన్ మైయై =(ఆశ్రిత వాత్సల్యమను) శీలమును; నినైవార్ = ధ్యానించుభక్తులు; ఎన్ దన్ = నాయొక్క; తలమిశై = శిరస్సుపై; మన్ను వారే = నిత్యవాసము చేయుచుండువారు సుమా!
తన ఆశ్రితులకు భూలోకమందును, పరలోకమందును(జ్ఞానమను)సుఖమును నొసుగుటయేగాక , మోక్షోపాయముగ నుండువాడును, శ్లాఘ్యమైన తోటలతో చుట్టబడిన శ్రీ రంగమందు నిత్యవాసము చేయువాడును , యుగమునకు తగిన తిరుమేనితో ఆ యుగమందు భక్తులకు కృపజేయువాడును, మరియు భూలోక వాసులు ; పరమపద వాసులు ఇరువురును సేవించి తరించుటకై శ్రీ వేంకటాద్రిపై కృపతో వేంచేసిన నీలమేఘశ్యాముడైన శ్రీనివాసుని ఆశ్రితవాత్సల్యమును ధ్యానించు పొయ్ గై, భూత ,పేయ్ మొదలగు పరమభక్తులు నా శిరోభూషణములగ ప్రకాశించుచున్నారు.
ఈ ఎనిమిదవ పాశురములో తిరుమంగై ఆళ్వారులు శ్రీమన్నారాయణుని దివ్య చరణములను ఆశ్రయించి సుఖజీవనముగడపని జనుల విషయమై తమ మనోవ్యధను వెలిబుచ్చుచున్నారు.
వానిడై ప్పుయలై మాలై , వరైయిడై ప్పిరశమీన్ఱ ,
తేనిడై క్కరుమ్బిన్ శార్ట్రై ,త్తిరువినై మరువి వాழாర్ ,
మానిడ ప్పిఱవియన్దో , మతిక్కిలర్ కొళ్ గ, తన్దమ్
ఊనిడైక్కురమ్బై వాழ்క్కైక్కు ,ఉఱుదియే వేణ్డినారే ll 2039
వానిడై ప్పుయలై = ఆకాశమునందు (వానాకాలమందు)గల నల్లని మేఘమువంటి తిరుమేని కలవాడును; మాలై =ఆశ్రితులయందు అమిత వ్యామోహము కలిగియుండువాడును; వరైయిడై = పర్వతములలో;పిరశము ఈన్ఱ = తేనెటీగలచే చేర్చబడు; తేన్ ఇడై కరుమ్బిన్ = తేనెల ప్రదేశముల మధ్య పెరిగిన చెరుకులయొక్క; శార్ట్రై = రసమువలె పరమభోగ్యుడును; తిరువినై = శ్రీ దేవికి శ్రీ అయిన శ్రీమంతుడైన సర్వేశ్వరుని; మరువి = ఆశ్రయించి; వాழாర్ = సుఖముగ జీవించనివారు; మానిడమ్ పిఱవి=(తాము సంపాదించుకొనిన అతి దుర్లభమైన) సద్గతి పొందజేయు ఈ మనుష్య జన్మము యొక్క ఫలమును; మతిక్కిలర్ కొళ్ గ = సక్రమముగ ఎంచకున్నారు; అన్దో = అయ్యయ్యో!; తమ్ తమ్ = తమ తమ యొక్క;ఊనిడై క్కురమ్బై వాழ்క్కైక్కు = మాంసభరితమైన నీటిలో ఉబుకు ఈ శరీరమును సుఖముగ నుంచుటకు; ఉఱుదియే = నిశ్చయించుకొని; వేణ్డినారే = మిక్కిలి ఆశపడుచున్నారుగదా!
నీలమేఘశ్యాముడును, ఆశ్రితులయందు అమిత వ్యామోహము కలిగియుండువాడును, చెరకురసమాధుర్యమువలె భోగ్యుడును,శ్రీ దేవికి శ్రీ అయిన శ్రీమంతుడైన సర్వేశ్వరుని ఆశ్రయించి ఉజ్జీవింపనివారు, అతి దుర్లభమైన ఈ మనుష్య జన్మము యొక్క ఫలమును సక్రమముగ ఎంచకున్నారు. అయ్యో! వారు మాంసభరితమైన నీటిలో ఉబుకు ఈ శరీరమును సుఖముగ నుంచుటకు నిశ్చయించుకొని,తహతహలాడుచు తమ జీవితమును గడుపుచున్నారుగదా! (అని ఆళ్వారులు వాపోచున్నారు)
ఈ తొమ్మిదవ పాశురములో తిరుమంగై ఆళ్వారులు తాము శ్రీమన్నారాయణుని చరణారవిందములందు చేరి సుఖించుటకు నిశ్చయముగలవారై మిక్కిలి ఆనందముతో తమ అనన్యగతిత్వమును వెలిబుచ్చుచున్నారు.
ఉళ్ళమో ఒన్ఱిల్ నిల్లాదు , ఓశైయిన్ ఎరి నిన్ఱు ఉణ్ణుమ్ ,
కొళ్ళిమేల్ ఎఱుమ్బుపోల , క్కుழைయుమ్ ఆల్ ఎన్దనుళ్ళమ్ ,
తెళ్ళియీర్ తేవర్కెల్లామ్ , తేవరాయ్ ఉలగమ్ కొణ్డ ,
ఒళ్ళియీర్ ఉమ్మైయల్లాల్ , ఎழுమైయుమ్ తుణైయిలోమే ll 2040
ఉళ్ళమో=ఈ మనసునే చూసినచో; ఒన్ఱిల్ నిల్లాదు=ఏ ఒక్క విషయమందును నిశ్చలముగ నుండుటలేదు; ఓశైయిన్ ఎరి = శబ్దించుచు అగ్ని; నిన్ఱు ఉణ్ణుమ్ = వ్యాపించి కబళించు చున్న; కొళ్ళిమేల్ = అట్టి అగ్నిచే దగ్ధమగు కట్టెపై మసలు; ఎఱుమ్బు పోల = చీమ వలె; ఎన్ దన్ ఉళ్ళమ్ = నాయొక్క మనస్సు; క్కుழைయుమ్ = మిక్కిలి తపించుపోచున్నది; ఆల్=అయ్యో!; తెళ్ళియీర్ = సర్వఙ్ఞుడైన సర్వేశ్వరా!; తేవర్కు ఎల్లామ్ తేవర్ ఆయ్ = దేవాదిదేవుడయిన శ్రీవారు; ఉలగమ్ కొణ్డ = (ఇంద్రునికై) మహాబలి నుండి మూడడుగులచే ముల్లోకములు కొలిచి స్వీకరించిన; ఒళ్ళియీర్ = తేజస్సు కలిగిన పరంజ్యోతీ!; ఉమ్మైయల్లాల్ = తమరిని తప్ప ; ఎழுమైయుమ్ = ఏడు జన్మలందును; తుణైయిలోమే = వేరొకరిని సహాయముగ కలిగియుండముగదా!
శ్రీ మన్నారాయణా! నా మనస్సు మిక్కిలి చంచలమై, మీ చరణములను పొందలేక మిక్కిలి తపించుపోవుచున్నాను . అంతటను వ్యాపించినవాడవును, సర్వఙ్ఞుడువును, దేవాదిదేవుడువును, ఇంద్రునికై మహాబలి నుండి మూడడుగులచే ముల్లోకములు కొలిచి స్వీకరించిన తేజస్సు కలిగిన పరంజ్యోతి స్వరూపుడవును,అయిన నీవే తప్ప , నేను ఏ జన్మమందైనను వేరొకరిని గతిగ కలిగియుండనుగదా!
ఈ పదియవ పాశురములో తిరుమంగై ఆళ్వారులు శ్రీమన్నారాయణునినే ఉపాయముగ ఎంచి , తనకు పరమభక్తిని ప్రసాదించమని ప్రార్దించుచున్నారు.
శిత్తముమ్ శెవ్వైనిల్లాదు , ఎన్ శెయ్ గేన్ తీవినైయేన్ ,
పత్తిమైక్కు అన్బుడై యేనావాదే , పణియాయ్ ఎన్దాయ్ ,
ముత్తొళి మరదకమే , ముழఙ్గొళి ముగిల్ వణ్ణా ,ఎన్
అత్త నిన్నడిమైయల్లాల్ , యాదుమొన్ఱఱిగిలేనే ll 2041
శిత్తముమ్ = నా మనస్సు; శెవ్వై = చక్కగా; నిల్లాదు = నిరంతరముగ శ్రీవారి కల్యాణ గుణములు అనుభవించునట్లు నిలకడకలిగియుండదు. తీవినైయేన్=(అట్టి స్వభావముగల) మహాపాపినగు నేను; ఎన్ శెయ్ గేన్ = ఏమి చేయగలను?; ఎన్ తాయ్ = తల్లి వలె నాకు మిక్కిలి ప్రీతిని కలుగజేయువాడా!; ముత్తు = ముత్యము వలె చల్లనివాడా!; ఒళి మరదకమే = ప్రకాశించు మరకతమువంటి తిరుమేని కలవాడా!; ముழఙ్గుఒళి ముగల్ వణ్ణా = గర్జించుచు పైకెగసి ప్రకాశించు నల్లని మేఘమువంటి స్వరూపము గలవాడా !; ఎన్ అత్త = నా తండ్రీ ! (నాకు తండ్రివలె హితమును చేయుటయేగాక , నాకు గురువైన వాడవును); పత్తిమైక్క=పరమభక్తితో; అమ్బు ఉడైయేన్ ఆవదే=దాసుడైన నేను (శ్రీవారి చరణములయందు) ప్రీతిచేయు విధమునే; పణియాయ్ = కృపజేయుమా! నిన్నడిమైయల్లాల్ = శ్రీవారి చరణములయందు కైంకర్యముచేయుటయే తప్ప; యాదుమ్ ఒన్ఱు = మఱియొక ఏ పురుషార్ధమును; అఱిగిలేనే = నాకు తెలియదే!
నా యొక్క మనస్సు నిరంతరముగ శ్రీవారి కల్యాణగుణములు అనుభవించునట్లు నిలకడకలిగియుండదు. అటువంటి స్వభావముగల మహా పాపినగు నేను ఏమి చేయగలను స్వామీ!. ముత్యము వలె చల్లనివాడవును ప్రకాశించు మరకతమువంటి తిరుమేని కలవాడవును, నీలమేఘశ్యాముడవును, తల్లి వలె నాకు మిక్కిలి ప్రీతిని కలుగజేయువాడవును , నాకు తండ్రివలె హితమును చేయుటయేగాక నాకు గురువైనవాడవును, అయినటువంటి శ్రీవారే తమ శ్రీచరణములందు దాసునకు పరమభక్తితో ప్రీతిచేయు విధమునే కృపజేయవలెను. శ్రీవారి చరణములయందు కైంకర్యముచేయుటయే తప్ప మఱియొక ఏ పురుషార్ధము నాకు తెలియదుకదా!
ఈ పదుకొండవ పాశురములో తిరుమంగై ఆళ్వారులు ఏఒక్కరును స్వయంకృషిచే (భగవంతుని అనుగ్రహము లేక )చేయు కైంకర్యములతో తమ దుఃఖములను తొలగించకొనజాలరని నిష్కర్షగా చెప్పుచూ, తాను ఆ అనుగ్రహప్రాప్తికై శ్రీమన్నారాయణుని శరణుజొచ్చుచున్నారు.
తొణ్డెల్లామ్ పరవి నిన్నై , త్తొழுదు అడి పణియమాఱు
కణ్డు , తాన్ కవలై తీర్పానావదే , పణియాయ్ ఎన్దాయ్ ,
అణ్డమాయ్ ఎణ్ తిశైక్కుమ్ , ఆదియాయ్ నీదియాన ,
పణ్డమామ్ పరమశోది , నిన్నైయే పరవువేనే ll 2042
తొణ్డు ఎల్లామ్ = సర్వవిధకైంకర్యములును; పరవి = ( చేయవలెనని పలుమార్లు ) నోటితో చెప్పియు; నిన్నై త్తొழுదు = శ్రీవారిని శరణుజొచ్చియు; అడి పణియమాఱు కణ్డు = శ్రీవారి పాదపద్మములను సేవచేయువిధమును మనసున ఎంచియు; తాన్ కవలై తీర్పానావదే = ఎవరైనను తానే తన దుఃఖములను తీర్చుకోగల సమర్ధుడో?; ఎన్దాయ్ = నిర్వాకుడగు సర్వేశ్వరా!; పణియాయ్ = నీవే తెలియజేయమా!; అణ్డమాయ్= బ్రహ్మాండములందుయున్న సకల జీవరాశులకును నిర్వాహకుడవును; ఎణ్ తిశైక్కుమ్ ఆదియాయ్ = ఎనమిది దిక్కులలోనుగల దేవతలందరకిని కారణభూతుడైనవాడవును; నీదియాన పణ్డమామ్ = చేతనులకు శ్రేష్టమైన ధనమువలె నుండువాడవును; పరమశోది =(వేదములచే ప్రతిపాదింపబడు) పరమజ్యోతి స్వరూపుడవును; నిన్నైయే = అయిన శ్రీవారినే; పరవువేనే = ఎడతెగక స్తుతించుదును.
స్వయంకృషిచే ఎవరైనను మనోవాక్కాయ కైంకర్యములతో తమ దుఃఖములను తీర్చుకోగల సమర్ధులో? (శ్రీవారి అనుగ్రహించినప్పుడే తప్ప) , నిర్వాకుడగు శ్రీమన్నారాయణా! నీవే తెలియజేయుమా. బ్రహ్మాండములందున్న సకల జీవరాశులకును నిర్వాహకుడవును, అన్ని దిక్కులలోనుగల దేవతలందరకిని కారణభూతుడైనవాడవును , చేతనులకు శ్రేష్టమైన ధనమువలె నుండువాడవును , (వేదములచే ప్రతిపాదింపబడు ) పరమజ్యోతి స్వరూపుడవును, అయిన శ్రీవారినే (పరమభక్తి ప్రాప్తికై) ఎడతెగక స్తుతించుదును.
ఈ పన్నెండవ పాశురములో తిరుమంగై ఆళ్వారులు , తన యొక్క అపరిశుద్ధమైన నాలుకతో పరమపురుషుడైన సర్వేశ్వరుని స్తుతించి మిక్కిలి అపచారము చేసినను , కరుణామయుడైన శ్రీ మన్నారాయణుని తనయందుగల సౌశీల్యమును వెలిబుచ్చుచున్నారు.
ఆవియై అరఙ్గమాలై , అழுక్కుడమ్బెచ్చిల్ వాయాల్ ,
తూయ్ మైయిల్ తొణ్డనేన్ నాన్ , శొల్లినేన్ తొల్లైనామమ్ ,
పావియేన్ పిழைత్తవాఱెన్ఱు , అఞ్జినేఱ్కు అఞ్జలెన్ఱు ,
కావిపోల్ వణ్ణర్ వన్దు , ఎన్ కణ్ణుళే తోన్ఱినారే ll 2043
ఆవియై = లోకములోనున్న సకల జీవరాశులకును ప్రాణభూతుడును; అరఙ్గమాలై = శ్రీరంగమందు నిత్యవాసము చేయు ఆశ్రితులయందు అమిత వ్యామోహము కలిగియుండు శ్రీమన్నారాయణుని; అழுక్కు ఉడమ్బు ఎచ్చిల్ వాయాల్ = దుర్గంధభరితమైన శరీరమునగల, (ఇతరులను పొగుడుట, అసత్యము పలుకుట మొదలగు క్రియలచే) ఎంగిలి నాలుకతో; తూయ్ మై ఇల్ తొణ్డనేన్ నాన్ = అపరిశుద్ధుడను, పలు చెడుకృత్యములను చేయుచున్న అహంకార పూరితుడైన నేను; తొల్లైనామమ్ = అనాదికాలమునుండి వచ్చుచున్న ( శ్రీవారి తిరుమంత్రము మొదలగు ) దివ్య నామములను; శొల్లినేన్ = పలుకుచుంటిని; పావియేన్ = ఇటువంటి పాపాత్ముడైననేను; పిழைత్త ఆఱు ఎన్ఱు = తప్పిదములుచేయు విధమును ఎంచి ; అఞ్జినేఱ్కు = భయపడుచున్న నన్ను; అఞ్జల్ ఎన్ఱు = ” నీకు ఎంతమాత్రము భయము వలదు ” అని అభయమొసంగి; కావిపోల్ వణ్ణర్ వన్దు = నల్ల కలువలవర్ణముతో మెరయు తిరుమేనిగల సర్వేశ్వరుడు కృపతో వేంచేసి, ఎన్ కణ్ణుళే తోన్ఱినారే = నా యొక్క కన్నులలోనే నాకు శ్రీపాద సేవ ప్రసాదించిరి కదా! (అని అమితానందభరితులగుచున్నారు.)
సకల జీవరాశులకును ప్రాణభూతుడైన శ్రీరంగమందు నిత్యవాసము చేయు శ్రీమన్నారాయణుని, దుర్గంధభరితమైన శరీరమునగల ఎంగిలి నాలుకతో అపరిశుద్ధుడను, పలు చెడుకృత్యములను చేయుచున్న అహంకారపూరితుడైన నేను, శ్రీవారి దివ్య నామములను పలుకు పాపాత్ముడైననేను , తప్పిదములుచేయు విధమును ఎంచి, భయపడుచున్న నన్ను , ” నీకు ఎంతమాత్రము భయము వలదు ” అని అభయహస్తముతో నల్ల కలువలవర్ణముతో మెరయు తిరుమేనిగల సర్వేశ్వరుడు కృపతో వేంచేసి, నా యొక్క కన్నులలోనే నాకు శ్రీపాద సేవ ప్రసాదించిరి కదా!
ఈ పదుమూడవ పాశురములో తిరుమంగై ఆళ్వారులు సర్వేశ్వరుని యొక్క దివ్యానుగ్రహమును , తాను అనుభవించిన ప్రకారమును వెలిబుచ్చుచున్నారు.
ఇరుమ్బు అనన్ఱు ఉణ్డనీరుమ్ , పోదరుమ్ కొళ్ గ , ఎన్దన్
అరుమ్ పిణి పావమెల్లామ్ , అగన్ఱన ఎన్నైవిట్టు ,
శురుమ్బు అమర్ శోలై శూழ்న్ద , అరఙ్గమా కోయిల్ కొణ్డ ,
కరుమ్బినై క్కణ్డుకొణ్డు , ఎన్ కణ్ణిణై కళిక్కుమాఱే ll 2044
ఇరుమ్బు = ఇనుము; అనన్ఱు = ఎఱ్ఱగ కాల్చబడినప్పుడు ; ఉణ్డ = అది గ్రహించిన; నీరుమ్ = జలము; పోదరుమ్ = సమస్తము బయటకు పోవుటను; కొళ్ గ = (దీనిని) దృష్టాంతముగ స్మరించవలెను ; ఎన్ తన్ = నాయొక్క అన్ని జన్మములనుండి సంపాదించుకొన్న; అరుమ్ = (నాచే) పోగొట్టుకొనశఖ్యముకాని, పిణి పావమెల్లామ్ = అన్ని బాధలకు కారణమగు పాపరాసులంతయును; ఎన్నైవిట్టు అగన్ఱన = నన్ను విడిచి తొలగిపోయినవి; శురుమ్బు అమర్ = తుమ్మెదలు సంచరించు; శోలై శూழ்న్ద = తోటలతో చుట్టుకొనియున్న; అరఙ్గమా కోయిల్ కొణ్డ = శ్రీ రంగం అను శ్లాఘ్యమైన దివ్య దేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న; కరుమ్బినై = ( ఆశ్రితులకు ) చెరకు రసమువలె అతి మధురముగా నుండు సర్వేశ్వరుని; కణ్ ఇణై = నాయొక్క రెండు కనులు; క్కణ్డుకొణ్డు = దర్శించికొని ( నన్ను సేవింపజేసి ) శ్రీవారి చరణములను తనలో స్ధిరపరుచుకొని; కళిక్కుమాఱే = అపరిమితానందము పొందు చున్నదిగదా !
ఏవిధముగ ఇనుము తాను గ్రహించిన జలముచే తుప్పుపట్టి చెడునో, ఆ ఇనుము అగ్నిచే ఆ నీటిని కోల్పోయి శుద్ధమగునో , నాయొక్క అన్ని జన్మములనుండి సంపాదించుకొన్న నాచే పోగొట్టుకొన శఖ్యముకాని సకలమైన బాధలకు కారణమగు పాపరాసులంతయును ( శ్రీమన్నారాయణుని అనుగ్రహముచే) నన్ను విడిచి తొలగిపోయినవి. (సర్వేశ్వరుని కృపచే) సుందరమైన తోటలతో చుట్టుకొనియున్న శ్రీరంగం అను దివ్య దేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న శ్రీ రంగనాథుని , నాయొక్క రెండు కనులు దర్శించికొని ( నన్ను సేవింపజేసి ) ,శ్రీవారి చరణములను స్ధిరపరుచుకొని అపరిమితానందము పొందు చున్నదిగదా! ” ఏమి నా మహా భాగ్యముమో ” యని పరవశముతో చెప్పుచున్నారు.
ఈ పదునాలుగవ పాశురములో తిరుమంగై ఆళ్వారులు తనను అనుగ్రహించిన శ్రీమన్నారాయణుని సమక్షమందు , గడిచిన దినములందు తమమనోప్రవృత్తిని మిక్కిలి శిథిలమైన మనస్సుతో నివేదించుచూ ముకుళిత హస్తములతో శ్రీవారిని సేవించుకొనుచున్నారు. (శ్రీమన్నారాయణుని నిర్హేతుకకృపయు, సౌలభ్యమును ఈ పాశురమున ఆళ్వారులు వెలిబుచ్చుచున్నారు.)
కావియై వెన్ఱ కణ్ణార్ , కలవియే కరుది , నాళుమ్
పావయేనాగ ఎణ్ణి , అతనుళ్ళే పழுత్తొழிన్దేన్ ,
తూవిశేర్ అన్నమన్నుమ్ , శూழ் పునల్ కుడందై యానై ,
పావియేన్ పావియాదు , పావియేన్ ఆయినానే ll 2045
కావియై = నల్ల కలువలను; వెన్ఱ = జయించిన; కణ్ణార్ = కన్నులుగల రమణులయొక్క; కలవియే = సంశ్లేష సుఖమునే; కరుది = భోగ్యముగ తలచుచు; నాళుమ్=ఎల్లప్పుడును; పావయేనాగ ఎణ్ణి= స్వల్పమైనను మంచి కృత్యములు ఏమియు చేయక మహాపాపి యగునట్లు మనోరథమును కలిగి; అదనుళ్ళే = ఆ సంశ్లేష సుఖమునే అనుభవింప తలంపులలోనే; పழுత్తు ఒழிన్దేన్ = సంపూర్ణముగ మునిగిపోతిని; తూవిశేర్ అన్నమ్ మన్నుమ్ = (అందమైన) రెక్కలుగల హంసలు వసించుచుండు; శూழ் పునల్ = జలసమృద్దిచే చుట్టబడియున్న;కుడందై యానై = తిరు కుడందై దివ్య దేశమునకు ప్రభువైన సర్వేశ్వరా!; పావియేన్ =పాపాత్ముడైన నేను; పావియాదు = (శ్రీవారి చరణములయందు) ధ్యానము చేయక ; పావియేన్ ఆయినానే = (దానికి పైన) పాపములకు హేతువైన భావమనస్కుడైతినిగదా!
నల్ల కలువలవలె నల్లని విశాలమైన నేత్రములుగల స్త్రీలయొక్క సంశ్లేష సుఖమునే భోగ్యముగ తలచుచు, స్వల్పమైనను మంచి కృత్యములు ఏమియు చేయక మహా పాపియగునట్లు మనోరథమును కలిగి ఆ సంశ్లేషసుఖమునే అనుభవింప తలంపులలోనే సంపూర్ణముగ మునిగిన, పాపాత్ముడైన నేను, తిరు కుడందై దివ్య దేశమునకు ప్రభువైన సర్వేశ్వరా! శ్రీవారి చరణములయందు ధ్యానముచేయక , (అది అటులుండగ) పాపములకు హేతువైన భావమనస్కుడైతినిగదా!
ఈ పదనైదవ పాశురములో , తిరు కుడందై దివ్య దేశములో వేంచేసిన శార్ఙ్గపాణి (ఆరావముదు పెరుమాళ్ ) సేవించుకొన్న తిరుమంగై ఆళ్వారులు, ఆ నాడు కిష్కిందలో, సీతాదేవి వృత్తాంతమును చెప్పి ముకుళిత హస్తములతో సేవించుకొనుచు స్థబ్ధుడై సర్వేశ్వరుని పాదములచెంత నున్న హనుమంతులవారిని , ఆనందముతో హృదయము ద్రవీకరించి నిలబడియున్న శ్రీ రామచంద్రుని, మానసికముగ దర్శించి, పరవశించి, ఆ సర్వేశ్వరునికి తిరుమంజనసేవ చేయుచున్నారు.
మున్ పొలా ఇరావణన్ తన్ , ముదు మదిళ్ ఇలఙ్గై వేవిత్తు ,
అన్బినాల్ అనుమన్ వన్దు , ఆఙ్గు అడియుణై పణియ నిన్ఱార్ క్కు ,
ఎన్బెలామ్ ఉరుగి ఉక్కిట్టు , ఎన్నుడై నెఞ్జమెన్నుమ్ ,
అన్బినాల్ ఙ్ఞాననీర్ కొణ్డు , ఆట్టువన్ అడియనేనే ll 2046
మున్ = త్రేతాయుగకాలమందు; పొలా = మిక్కిలి క్రూరడైన;ఇరావణన్ తన్ = రావణాసురుని యొక్క; ముదు = అతి ధృడమైన; మదిళ్ = ప్రాకరములుగల; ఇలఙ్గై = లంకాపురిని; వేవిత్తు = అగ్నిచే భస్మీపటలముచేసి; అన్బినాల్ = అత్యంత భక్తితొ; అనుమన్ = శ్రీమత్ ఆంజనేయుడు; వన్దు = వెనుదిరిగి వచ్చి; ఆఙ్గు = ఆ కిష్కిందలో; అడియుణై పణియ = శ్రీపాదద్వందములను సేవింపబడునట్లు; నిన్ఱార్ క్కు= (హనుమంతుడు వినయముతో వివరించగ సీతాదేవి యొక్క వృత్తాంతమును విని అమితానందభరితుడై ద్రవించిన హృదయముతో) నిలబడియున్న సర్వేశ్వరునికి; ఎన్బెలామ్=నా ఎముకలంతయు;ఉరుగి = ద్రవించి; ఉక్కిట్టు=శిధిలమై; ఎన్నుడై నెఞ్జమ్ ఎన్నుమ్ =నాయొక్క మనస్సు; అన్బినాల్= అత్యంత ప్రేమతో; ఙ్ఞాననీర్ కొణ్డు=ఙ్ఞానమనే జలములచే (అట్టి పరిమళభరితమైన నీటిచే); అడియనేనే = దాసుడైన నేను; ఆట్టువన్ = తిరుమంజనసేవ చేసెదను.
త్రేతాయుగకాలమందు, హనుమంతులవారు సీతాదేవిని అన్వేషించి,తల్లిని సేవించుకొని, రావణాసురుని యొక్క ధృడమైన ప్రాకరములుగల లంకాపురిని అగ్నిచే భస్మీపటలముచేసి, కిష్కిందకు తిరిగివచ్చి, శ్రీరామునికి జరిగిన వృత్తాంతమును చెప్పి, ముకుళిత హస్తములతో సేవించుకొనుచు స్థబ్ధుడై సర్వేశ్వరుని పాదములచెంత నుండుటను, ఆ వృత్తాంతమును విని అమితానందభరితుడై ద్రవించిన హృదయముతో హనుమంతుని చెంతనున్న సర్వేశ్వరుని (మానసికముగ) గాంచి , శిధిలమైన ఎముకలతో నిండిన శరీరముగల దాసుడైననేను , మనసా అత్యంత ప్రేమతో, ఙ్ఞానమనే జలములచే (అట్టి పరిమళభరితమైన నీటిచే) సర్వేశ్వరునికి తిరుమంజనసేవ చేసెదను.
ఈ పదునాఱవ పాశురములో తిరుమంగై ఆళ్వారులు, తాను తిరుమంజనసేవ గావించిన సర్వేశ్వరుని శ్లాఘ్యమైన సూక్తులమాలతో అలంకరించి మధురానుభూతితో ఉప్పొంగిపోచున్నారు.
మాయమాన్ మాయ శెర్ట్రు , మరుదు ఇఱ నడన్దు , వైయమ్
తాయ మా పరవై పొఙ్గ , తడవరై తిరుత్తు , వానోర్కు
ఈయుమ్ మాల్ ఎమ్బిరానార్కు , ఎన్నుడై చ్చొఱ్కళెన్నుమ్ ,
తూయ మామాలైకొణ్డు , శూట్టువన్ తొణ్డనేనే ll 2047
మాయమ్ = కపటమైన; మాన్ = లేడి రూపమునుదాల్చివచ్చిన మారీచుని; మాయ = అదృశ్యమగునట్లు (మరణమగునటుల); శెర్ట్రు=బాణమునుప్రయోగించి వధించినవాడును; మరుదు ఇఱ = రెండు మద్ది వృక్షములు విరిగి క్రిందపడునట్లు, నడన్దు = వాటి మధ్య పాకినవాడును; వైయమ్ = సర్వ లోకములను; తాయ = త్రివిక్రముడై కొలిచినవాడును; మా పరవై = పెద్దదైన పాలసముద్రమును; పొఙ్గ = పొంగి పొరులునటులు; తడవరై = పెద్ద మందర పర్వతముతో; తిరిత్తు = చిలికి; వానోర్కు = దేవతలకు; ఈయుమ్ = అమృతమును కృపతో నొసగువాడగు; మాలై = ఆశ్రితులయందు అమిత వ్యామోహము కలిగియుండు వాడైన; ఎమ్బిరానార్కు= సర్వేశ్వరునికి; ఎన్నుడై=నాయొక్క;శొఱ్కళెన్నుమ్=సూక్తులనెడి; తూయ =పరిశుద్దమైన; మామాలైకొణ్డు = శ్లాఘ్యమైన మాలతో; తొణ్డనేనే = శ్రీవారిచరణముల యందు నిత్య దాసుడగు నేను; శూట్టువన్ = అలంకరించుదును.
శ్రీ రామావతారమందు ,లేడి రూపమునుదాల్చివచ్చిన కపటమైన మారీచుని బాణమునుప్రయోగించి వధించినవాడును, శ్రీకృష్ణావతారమందు, రెండు మద్ది వృక్షములు విరిగి క్రిందపడునట్లు వాటి మధ్య పాకినవాడును, వామనావతారమందు మహాబలి నుండి మూడడుగులచే ముల్లోకములు కొలిచి స్వీకరించినవాడును, శ్రీ కూర్మావతారము ఎత్తి, మరియు జగన్మోహినిగ అవతరించి పాలసముద్రమును మందర పర్వతముతో చిలికి దేవతలకు అమృతమును కృపతో నొసగినవాడును, ఆశ్రితులయందు అమిత వ్యామోహము కలిగియుండువాడైన సర్వేశ్వరుని, సూక్తులనెడి శ్లాఘ్యమైన మాలతో దాసుడగు నేను అలంకరించుదును.
ఈ పదునేడవ పాశురములో తిరుమంగై ఆళ్వారులు , తనను శ్రీమన్నారాయణుని గంభీరమైన మనస్సునకు అనుగుణముగ నుండుటను మిక్కిలి సమర్పణ భావముతో వెలిబుచ్చుచున్నారు.
పేశినార్ పిఱవినీత్తార్ , పేరుళాన్ పెరుమై పేశి ,
ఏశినార్ ఉయ్ న్దు పోనార్ , ఎన్బదు ఇవ్వులగిన్ వణ్ణమ్ ,
పేశినేన్ ఏశమాట్టేన్ , పేదైయేన్ పిఱవినీత్తఱ్కు ,
ఆశయో పెరిదు కొళ్ గ , అలై కడల్ వణ్ణర్ పాలే ll 2048
పేర్ ఉళాన్ = తిరు ప్పేర్ దివ్య దేశములోకృపతో వేంచేసిన సర్వేశ్వరుని యొక్క; పెరుమై = కళ్యాణ గుణములను; పేశినార్ = స్తుతించినవారు; పిఱవినీత్తార్ = జన్మ రాహిత్యము పొంది ముక్తిని బడసిరి; పేశి ఏశినార్ = ఆ సర్వేశ్వరుని ఉద్దేశించి పరిహసించుచు, నిందించుచు పలుకు శిశుపాలుడు మొదలగువారు;ఉయ్ న్దు పోనార్=సద్గతినిపొంది ఉజ్జీవింపబడినారు;ఎన్బదు=అని చెప్పబడునవి అంతయును; ఇవ్వులగిన్ వణ్ణమ్ = ఈ లోకమందు చెప్పబడుచున్న విధము (శాస్త్రమర్యాదల ననుసరించి నుండునవి). పేదైయేన్ = జ్ఞానశూన్యుడైన నేను; పేశినేన్ = సర్వేశ్వరుని వైభవమును స్తుతించు సమర్ధుడునా?; ఏశమాట్టేన్ = (శిశుపాలుడు మొదలగువారి వలె) పరిహసించుచు నిందించను; పిఱవినీత్తఱ్కు=ఈ సంసారబందముల తొలగి పోవుటకు(పరమపదప్రాప్తికై); అలై కడల్ వణ్ణర్ పాలే = అలలుకొట్టుచున్న సముద్రము పోలిన తిరుమేనిగల సర్వేశ్వరుని కృపపైనే; ఆశయో పెరిదుకొళ్ గ= అపేక్ష ఎక్కువగా కలవాడను.
సర్వేశ్వరుని కళ్యాణ గుణములను స్తుతించినవారు జన్మరాహిత్యము పొంది ముక్తిని బడసిరనియు, ఆ సర్వేశ్వరుని కళ్యాణ గుణములను పరిహసించుచు , నిందించుచు పలుకు శిశుపాలుడు మొదలగువారు కూడ ఉజ్జీవింపబడినారని ఈ లోకమందు శాస్త్ర మర్యాదల ననుసరించి చెప్పబడుచున్న విధము. ఆళ్వారులు తాము శ్రీమన్నారాయణుని వైభవమును స్తుతించుగల జ్ఞానములేదనియు, మరియు సర్వేశ్వరుని శిశుపాలుడు మొదలగువారివలె నిందించలేననియు చెప్పి, నీలమేఘశ్యాముడైన సర్వేశ్వరుని కృపపైననే మిక్కిలి ఆపేక్షకలవాడనని తమ మనోస్థితిని వెలిబుచ్చినారు.
ఈ పద్దెనమదవ పాశురములో తిరుమంగై ఆళ్వారులు, యోగ శాస్త్ర నియమములతో సర్వేశ్వరుని ప్తత్యక్షదర్శనము పొందవలయునని అపేక్షించు ఉపాసకులు , ఆ సర్వేశ్వరుని కృపవలననే దర్శనభాగ్యము పొందుదురని తెలియజేయుచున్నారు. శ్రీ మన్నారాయణుడే ఉపాయము, ఉపేయమని ఆళ్వారులు తెలియజేయుచున్నారు.
ఇళైప్పినై యియక్కమ్ నీక్కి , ఇరున్దు మున్నిమైయైక్కూట్టి ,
అళప్పిల్ ఐమ్బులనడక్కి , అన్బు అవర్ కణ్ణే వైత్తు ,
తుళక్కమిల్ శిందైశెయ్ దు , తోన్ఱలుమ్ శుడర్ విట్టు , ఆఙ్గే
విళక్కినై విదియిన్ కాణ్బార్ , మెయ్ మ్మైయే కాణ్గిఱ్పారే ll 2049
ఇళైప్పినై యియక్కమ్ నీక్కి = క్లేశములతో కూడిన సంసారమును విడిచి; ఇరున్దు = యోగాసనములో కూర్చుని; మున్నిమైయైక్కూట్టి=దృష్ఠిని నాశికాగ్రమందు కేంద్రీకరించి; అళప్పిల్ ఐమ్బులనడక్కి = అపరిమితమైన బాహ్యవిషయములందు సంచరించు పంచేంద్రియములను నిరోధించి; అన్బు= విశ్వాశమును; అవర్ కణ్ణే వైత్తు= సర్వేశ్వరుని విషయమందే సారించి; తుళక్కమిల్ శిందైశెయ్ దు = అచంచలమైన ధ్యానముచేసి; ఆఙ్గే = అట్టి నియముములతో, శుడర్ విట్టు తోన్ఱలుమ్ = దేదీప్యమాన జ్ఞానస్థితిని పొంది, విళక్కినై = పరమజ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని; విదియిన్ = (ఇట్టి)శాస్త్రవిధులద్వారా; కాణ్బార్ = దర్శించికొనవలయునని (సాక్షాత్కారము పొందవలయునని) అపేక్షించు ఉపాసకులు; మెయ్ మ్మైయే = తాము మనసులో తలచుకున్నట్లుగ; కాణ్ కిఱ్పారే = (సర్వేశ్వరుని నిర్హేతుకకృప లేనిచో) దర్శనమును పొందగల సమర్ధులా?
అజ్ఞానము, అహంకారము , (కోరికలయందు) అనురాగము, ధ్వేషము, మరణభయము మొదలగు క్లేశములతో కూడిన సంసారమును విడిచి, యోగాసనములో కూర్చుని, దృష్ఠిని నాశికాగ్రమందు కేంద్రీకరించి, బాహ్యవిషయములందు సంచరించు పంచేంద్రియములను నిరోధించి, సర్వేశ్వరుని విషయమందే అచంచలమైన ధ్యానముచేసి, (ఇట్టి శాస్త్రవిధులద్వారా) , వేదములచే ప్రతిపాదింపబడు పరమజ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని, సాక్షాత్కారము పొందవలయునని అపేక్షించు ఉపాసకులు , సర్వేశ్వరుని నిర్హేతుకకృపవలన మాత్రమే దర్శనమును పొందగలరు.
ఈ పంతొమ్మిదవ పాశురములో తిరుమంగై ఆళ్వారులు శ్రీమన్నారాయణుని పరత్వమును, సౌలభ్యమును విశదీకరించుచున్నారు.
** పిణ్డియార్ మణ్డైయేన్ది , ప్పిఱర్ మనై తిరితన్దు ఉణ్ణుమ్,
ఉణ్డియాన్ శాబమ్ తీర్త , ఒరువనూర్, ఉలగమేత్తుమ్,
కణ్డియూర్ అరఙ్గమ్మెయ్యమ్ , కచ్చి పేర్ మల్లైయెన్ఱు
మణ్డినార్ , ఉయ్యలల్లాల్ , మర్ట్రైయార్కు ఉయ్యలామే ll 2050
పిణ్డి ఆర్ మణ్డై ఏన్ది = (క్రిములకారణముగ) పొడి పొడిగ రాలు మొండెమును చేతిలో నుంచుకొని;పిఱర్ మనై =దగ్గర సంబంధించిన గృహములలో;తిరితన్దు=(బిక్షమెత్తు కొని) తిరుగుచు; ఉణ్ణుమ్ = జీవించు; ఉణ్డియాన్ = అట్టి భిక్షపాత్రగల రుద్రుని యొక్క; శాబమ్ = బ్రహ్మ హత్యచే కలిగిన శాపమును; తీర్త = కృపతో పోగొట్టిన; ఒరువన్ = తనతో సమానమైన వాడును,అధికుడు లేనివాడును అయిన అద్వితీయుడైన సర్వేశ్వరునియొక్క;; ఊర్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశములును; ఉలగమ్ ఏత్తుమ్=ఈ లోకములోని భక్తులచే ఆశ్రయింపబడి స్తోత్రముచేయుబడు చుండునవియు; కణ్డియూర్ అరంగమ్ మెయ్యమ్ కచ్చి పేర్ మల్లై యెన్ఱు=తిరుకణ్డియూర్, తిరువరంగము, తిరుమెయ్యమ్, తిరుకచ్చి, తిరుప్పేర్, తిరుక్కడమల్లై , అని అనుసంధించుచు, మణ్డినార్ = (ఆ దివ్యదేశములందు వేంచేసిన సర్వేశ్వరుని పాదపద్మములందు) లీనమైయుండెడి భక్తులు; ఉయ్యలల్లాల్ =(సర్వేశ్వరుని అనుగ్రహమును పొంది) ఉజ్జీవింపబడు విధముగాక; మర్ట్రైయార్కు ఉయ్యలామే = మఱియొకరెవరైనను ఆశ్రయించి ఉజ్జీవింపతగు మార్గము కలదా?
బ్రహ్మహత్యాపాతకముచే శపింపబడి తనచేతికి అంటి శిధిలమగుచున్న కపాలముచే బిక్షమెత్తుకొని సకలప్రదేశములు తిరుగుచున్న రుద్రునియొక్క శాపమును తొలగించిన అద్వితీయుడైన నీలమేఘశ్యాముడైన సర్వేశ్వరుడు , తిరుకణ్డియూర్, తిరువరంగము, తిరు మెయ్యమ్,తిరుకచ్చి, తిరుప్పేర్ తిరుక్కడమల్లై మొదలగు దివ్యదేశములలో కృపతో నిత్యవాసము చేయుచు, ఆశ్రితులను ఉజ్జీవింపజేయుచుండగ, అట్టి మిక్కిలి సులభతరమైన మార్గముకంటె , ఉపాశకులకు వేరొక ఉజ్జీవింపజేయు విధానము లేదని తిరుమంగై ఆళ్వారులు (తాను అనుభవించిన) సర్వేశ్వరుని యొక్క సౌలభ్యమును, దివ్యదేశవైభవమును తెలియజేయుచున్నారు.
ఈ ఇరువదియవ పాశురములో తిరుమంగై ఆళ్వారులు తిరుక్కుఱున్దాడకమ్ ప్రభంధము యొక్క పఠన ఫలశృతి చెప్పుచున్నారు.
** వానవర్ తఙ్గళ్ కోనుమ్ , మలర్ మిశై అయనుమ్ ,నాళుమ్
తేమలర్ తూవి యేత్తుమ్ , శేవడి శెఙ్గణ్ మాలై ,
మానవేల్ కలియన్ శొన్న ,వణ్ తమిழ் మాలై నాలైన్దుమ్ ,
ఊనమదిన్ఱి వల్లార్ , ఒళి విశుమ్బు ఆళ్ వర్ తామే ll 2051
వానవర్ తఙ్గళ్ కోనుమ్ = దేవేంద్రుడును; మలర్ మిశై అయనుమ్ = తామర పుష్పము నుండి పుట్టిన బ్రహ్మయును; నాళుమ్ = ఎల్లప్పుడును; తేమలర్ తూవి = తేనెలొలుకు పుష్పములు సమర్పించి; ఏత్తుమ్ = స్తుతించుచుండెడి; శేవడి = సుందరమైన శ్రీ పాదములుగలవాడును ; శెమ్ కణ్= ఎఱ్ఱ తామరపూవువంటి నేత్రములు గలవాడును; మాలై = ఆశ్రితులయందు అమిత వ్యామోహము కలిగియుండువాడైన సర్వేశ్వరుని; మానవేల్ = కీర్తిగల శూలముకలవారైన; కలియన్ = తిరుమంగై ఆళ్వారులు; శొన్న = కృపతో చెప్పిన; వణ్ తమిழ் = అందమైన తమిళ భాషలోనున్న; మాలై నాలైన్దుమ్ = ఈ ఇరువది పాశురములును; ఊనమ్ అదు ఇన్ఱి = అనన్య ప్రయోజనులై ఏ ఒక్కటియు తక్కువ లేకుండా; వల్లార్ తామ్ = అభ్యసించినవారు; ఒళి విశుమ్బు = ప్రకాశించుచుండు పరమపదమును; ఆళ్ వర్ = పాలించు భాగ్యమును పొందుదురు.
బహ్మ, ఇంద్రాదిదేవతులు ఎల్లప్పుడును శ్లాఘ్యమైన పుష్పములను సమర్పించి , స్తుతించుచుండు, సుందరమైన శ్రీ పాదములుగలవాడును, ఎఱ్ఱ తామరపూవువంటి నేత్రములుగలవాడును, ఆశ్రితులయందు అమిత వ్యామోహము కలిగియుండువాడైన సర్వేశ్వరుని విషయమై, తిరుమంగై ఆళ్వారులు కృపతో చెప్పిన అందమైన తమిళ భాషలోనున్న ఈ ఇరువది పాశురములును అభ్యసించినవారు ప్రకాశించుచుండు పరమపదమును పాలించు భాగ్యమును పొందుదురు.(శ్రీమన్నారాయణుడు తన భక్తులకు తనతో సమానమైన ఆనందమును ప్రసాదించుననెడి భావమును ఆళ్వారులు వెలిబుచ్చుచున్నారు).
తిరుమఙ్గై ఆళ్వార్ తిరువడిగళే శరణం
**************