తిరువెழுకూర్ట్రిరుక్కై

శ్రీః

శ్రీమతే రామానుజాయనమః

తిరుమంగై ఆళ్వార్ ముఖారవిన్దమునుండి వెలువడిన తిరువెழுకూర్ట్రిరుక్కై అను మూడవ ప్రబంధము 46 చరణములతొ  సర్వేశ్వరుని దివ్య చరణములయందు పాడిన శరణాగతి ప్రబంధము. 

తిరుమంగై ఆళ్వార్ , దివ్యదేశములలో కృపతోవేంచేసిన సర్వేశ్వరుని గాంచి,  భక్తిపారవశ్యముతో శ్రీమన్నారాయణుని చెంత పాడిన పాశురములలోను (పెరియతిరుమొழி ప్రబంధము), మరియు తిరుక్కుఱున్దాడకమ్, శిఱియతిరుమడల్ , పెరియతిరుమడల్, తిరునెడున్దాడకమ్ ప్రబంధములలోను ఆసుకవిత్వము,విస్తార కవిత్వము, మధురకవిత్వము కానవచ్చును. వీరు తిరువెழுకూర్ట్రిరుక్కై ప్రబంధమును  అద్భుతమైన చిత్రకవిత్వముతొ ప్రసాదించిరి. ఆకారణముచే విద్వాంసులు వీరిని  “చతుష్కవి శిఖామణి ” గ  కొనియాడుదురు.

                      తిరుక్కుడందై దివ్యదేశములో శార్ఙ్గపాణి కోవెలయందు రెండువైపుల అశ్వములతోను, ఏనుగులతోను అమరి రథమువలెనున్న గర్భగుడియందు “ఆరావముదు పెరుమాళ్ ” ను దర్శించిన తిరుమంగై ఆళ్వార్ తిరువెழுకూర్ట్రిరుక్కై {తిరు=శుభమైన, ఎழு=ఏడు,కూర్ట్రు= భాగములుగల , ఇరుక్కై= (రథముపై)వేంచేసిన సర్వేశ్వరుడు} ప్రబంధము లోని పదములు ఏడు భాగములుగల చిత్రరథములో అమరునట్లు పాడిన దివ్య శరణాగతి పాశురము. (ఇది భక్తుల తమ మనోరథమందు సర్వేశ్వరుని ఆరాధించుకొని తరించు పాశురము). దివ్యదేశములలో ప్రతి రథోత్సవమందు ఈ పాశురము మిక్కిలి ప్రీతితో గానముచేయబడును.

తిరుక్కుడందై దివ్యదేశము (  శార్ఙ్గపాణి పెరుమాళ్ కోయిల్ )

కావేరినది ఒడ్డున వెలసిన పంచ రంగ క్షేత్రములలో ఇది ఒకటి. ఇచట ఉత్సవర్ శార్ఙ్గవిల్లును ధరించియుండుటచే ఈ క్షేత్రమును శార్ఙ్గపాణి పెరుమాళ్ కోయిల్ అని  పిలుతురు. పూర్వము వైకుంఠమునకు వెడలిన భృగు మహర్షి   (యోగనిద్రయందు అమరియున్న) శ్రీమహావిష్ణుమూర్తి , తన రాకను గమనించలేదని క్రోధితుడై, శ్రీ మహాలక్ష్మి నివాసస్థానమైన స్వామి వక్షస్థలముపై తన్నగా, శ్రీదేవి కోపగించి వైకుంఠమును వీడెను. కొంతకాలము గడచిన పిదప ఆమె కోమలవల్లిగ తిరుక్కుడందై దివ్యదేశములో ఉద్భవించగ, హేమమహర్షిచే పెంచబడెను. శ్రీమన్నారాయణుడు రథముపై ఏతెంచి కోమలవల్లిని పరిణయమాడెను. శార్ఙ్గపాణి పెరుమాళ్, కోమలవల్లి తాయార్ వేంచేసియున్న గర్భగుడి రథమాకారములో నుండును. 

        ఆళ్వారులు ప్రసాదించిన పాశురములు కాలగతిలొ మరుగపడగ , ఇచటనే  పెరుమాళ్ సన్నిధిలో     “ఆరావముదే … ” అని (నమ్మాళ్వార్ ప్రసాదించినది) కొన్ని పాశురములను విని, శ్రీనాథమునులు మిక్కిలి ఉత్తేజముపొంది, తమ తపస్సుచే నమ్మాళ్వార్ ను సాక్షాత్కారించుకొని వారి కృపచే, ఆళ్వారులు  అందరు పాడిన పాశురములను ,ద్రావిడ వేదమనబడు “నాలాయిర దివ్యప్రభంధము”గ పునరుద్ధరణ గావించిరి. ఈ దివ్యదేశములోవేంచేసిన ఆరావముద పెరుమాళ్ ను ఆళ్వారులు 53 పాశురములతో మంగళాశాసనము చేసిరి.

శార్ఙ్గపాణి పెరుమాళ్ గర్భగుడి Photo credit: @thatguyfrombengaluru

  శ్రీః 

శ్రీమతే రామనుజాయనమః 

తిరుమంగై ఆళ్వార్ ముఖారవిన్దమునుండి వెలువడిన

తిరువెழுకూర్ట్రిరుక్కై 

*************

 తనియన్

వాழி పరకాలన్ వాழி కలికన్ఱి 

వాழி కుఱైయలూర్ వాழ் వేన్దన్ వాழிయరో

మాయోనై వాళ్ వలియాల్ మన్దిరఙ్గొళ్ మఙ్గైయర్ కోన్

తూయోన్   శుడర్    మానవేల్ .

 •••••

( ఈ ప్రబంధములో తిరుమంగై ఆళ్వార్ తిరుక్కుడందై ఆరావముదు పెరుమాళ్ దివ్య చరణారవిందములందు శరణాగతి చేయుచున్నారు )

ఒరు పేర్ ఉన్ది యిరుమలర్ త్తవిశిల్ ,

ఒరు ముఱై యయనై యీన్ఱనై ,ఒరుముఱై 

ఇరుశుడర్ మీతినిల్ ఇయఙ్గా, ముమ్మతిళ్

 ఇలఙ్గై యిరుకాల్ వళైయ, ఒరు శిలై

ఒన్ఱియ ఈర్ ఎయిర్ట్రు అழల్వాయ్  వాళియిన్

అట్టనై , మూవడి నానిలమ్ వేణ్డి ,

ముప్పురి నూలొడు మాన్ ఉరి యిలఙ్గు

మార్వినిన్ , ఇరుప్పిఱప్పు ఒరు మాణాగి,

ఒరు ముఱై యీరడి  మూవులగళణ్దనై ,

నాల్ దిశై నడుఙ్గ , అఞ్జిరై ప్పఱవై

యేఱి , నాల్వాయ్ ముమ్మతత్తు ఇరు శెవి

ఒరు తని వేழత్తు అరన్దైయై , ఒరు నాళ్

ఇరు నీర్ మడువుళ్ తీర్తనై , ముత్తీ

నాన్మఱై  ఐ వగై వేళ్వి,  అఱు తొழிల్

అన్దణర్ వణఙ్గుమ్ తన్మైయై ,ఐమ్బులన్

అగత్తినుళ్ శెఱుత్తు ,  నాన్గుడనడక్కి

ముక్కుణత్తు ఇరణ్డవై అగర్ట్రి, ఒన్ఱినిల్

ఒన్ఱినిన్ఱు , ఆఙ్గిరుపిఱప్పఱుప్పోర్ 

అరియుమ్ తన్మైయై,ముక్కణ్ నాల్ తోళ్

ఐవాయ్ అరవోడు , ఆఱుపొతి శడైయోన్

అఱివరుంతన్మై పెరుమైయుళ్ నిన్ఱనై ,

ఏழுలగెయిర్ట్రినిల్ కొణ్డనై , కూఱియ

అఱు శువై ప్పయనుమాయినై , శుడర్విడుం

ఐమ్బడై అఙ్గైయుళ్ అమర్ న్దనై , శున్దర

నాల్ తోళ్ మున్నీర్ వణ్ణ , నిన్ ఈరడి

ఒన్ఱియ మనత్తాల్ , ఒరు మది ముగత్తు 

మఙ్గైయర్ ఇరువరుం మలరన ,అఙ్గైయిన్

       ముప్పొழுదుమ్ వరుడ అఱి తుయిలమర్ న్దనై ,

నెఱిముఱై నాల్ వగై వరుణముమాయినై ,

మేతగుమ్ ఐమ్ పెరుమ్ పూతముమ్ నీయే ,

అఱుపత మురలుం కూన్దల్ కారణమ్ ,

ఏழ்విడై యడఙ్గ శెర్ట్రనై , అఱువగై

చ్చమయమ్ అఱివరు నిలైయినై , ఐమ్ పాల్

ఓతియై ఆగత్తిరుత్తినై , అఱముదల్

నాన్గవైయాయ్ మూర్తిమూన్ఱాయ్ ,

ఇరువగై ప్పయనాయ్ ఒన్ఱాయ్ విరిన్దు

నిన్ఱనై , కున్ఱా మదు మలర్ శోలై

వణ్ కొడి ప్పడప్పై , వరు పునల్  పొన్ని

మామణి యలైక్కుమ్ , శెన్నల్ ఒణ్ కழని

తిగழ் వనమ్ ఉడుత్త , కఱ్పోర్ పురిశై

కనకమాళికై , నిమిర్ కొడి విశుమ్బిల్ 

ఇళమ్ పిఱై తువక్కుం , **శెల్వం మల్గు తెన్

తిరుక్కుడన్దై** , అన్దణర్ మన్దిరమొழிయుడన్ 

వణఙ్గ , ఆడరవు అమళియిల్ అఱితుయిల్

అమర్ న్ద పరమ , నిన్నడియిణై పణివన్

వరుమ్ ఇడర్ అగల మార్ట్రో వినైయే ,

ఇడఙ్గొణ్డ నెఞ్జత్తిణఙ్గి క్కిడప్పన , ఎన్ఱుమ్ పొన్ని 

తడఙ్గొణ్డ తామరై శూழுమ్ మలర్ న్ద తణ్ పూమ్ కుడన్దై ,

విడఙ్గొణ్డ వెణ్ పల్ కరుమ్ తుత్తి శెఙ్గణ్ తయలుమిழ் వాయ్

పడఙ్గొణ్డ పామ్బణై ప్పళ్ళికొణ్డాన్ తిరుప్పాదఙ్గళే ll  2672

***************

 (గమనిక: ఈ పాశురమును చిన్న చిన్న భాగములుగ విడదీసి ప్రతిపదార్ధములు ఒనరించినను,  వానిని సమీకరించి ,అఖండమైన పాశురము యొక్క భావమును మనస్సునందు అనుభవింపవలయును.)

ఒరు పేర్ ఉన్ది యిరుమలర్ త్తవిశిల్ ,

ఒరు ముఱై యయనై యీన్ఱనై , 

ఒరు = విలక్షణమైన; పేర్ = విఖ్యాతిపొందిన; ఉన్ది = నాభియందుగల;  ఇరు = విశాలమైన; మలర్ = తామరపుష్పమనెడి; తవిశిల్ = ఆశనముపై; ఒరు ముఱై = ఒకానొక కాలమందు; అయనై =బ్రహ్మను; ఈన్ఱనై = సృష్టించినవాడును;

ప్రళయకాలమనంతరము సృష్టిగావింపనెంచి సర్వేశ్వరుడు తన నాభికమలమందు చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి, వేదములను అనుగ్రహించి , అతనిచే మునపటివలనే ఈ జగదుద్భవింపజేసినవాడును, ( ఇందు ఆళ్వార్ సర్వేశ్వరుని జగత్ కారణత్వమును మొదట చెప్పుచున్నారు. )

 …   … … …   …   …  ఒరుముఱై 

ఇరుశుడర్ మీతినిల్ ఇయఙ్గా, ముమ్మతిళ్

ఇలఙ్గై యిరుకాల్ వళైయ, ఒరు శిలై

ఒన్ఱియ ఈర్ ఎయిర్ట్రు అழల్వాయ్  వాళియిన్

అట్టనై,   ….     ….       ….   ………

ఒరుముఱై =(పూర్వము ఒకప్పుడు శ్రీరామునిగ అవతరించిన కాలమందు) ఒక పర్యాయమైనను; ఇరుశుడర్ = సూర్యచంద్రులు; మీతినిల్ ఇయఙ్గా = (మిక్కిలి భయస్థులై) మీద సంచరింపజాలనదియు; ముమ్మతిళ్ = మూడు ప్రాకారములచే  (నీటిఅగడ్తలుతోను,పర్వత కోటలతోను, అడవులతోను) చుట్టబడినదియు అయిన; ఇలఙ్గై = లంకాపురిని;యిరుకాల్ వళైయ = రెండువైపుల వంచి; ఒరు శిలై = సాటిలేని శార్ఙ్గమనువిల్లుచే; ఒన్ఱియ ఈర్ ఎయిర్ట్రు = (విల్లు యందు) అమరి యుండునదియు, రెండుదంతములుకలదియు; అయల్ వాయ్ = నిప్పులుగ్రక్కు నోరుగలదియు  అయిన; వాళియిన్ = బాణములచే; అట్టనై = భస్మీపటలము చేసినవాడును;

(సంకల్పమాత్రముచే  లోకములను సృష్టి గావించుటను స్తుతించి, ఆ లోకములందు ధర్మము నశించునపుడు సర్వేశ్వరుడు కృపతో అవతరించి రక్షించుటను ఆళ్వార్ పేర్కొనుచున్నారు.) దేవతలసహితము తన అధీనములో నుంచుకొన్నవాడును, వరబలముచే మిక్కిలి క్రూరుడును, అభేద్యమైన లంకాపురిలో అనేక బలిష్టులైనరాక్షసులసమూహములచే కూడియున్న రావణాసురుడు, సీతాదేవిని అపహరించి లంకలో బంధించగ , ఆరావణునితోపాటు , లంకాపురిని , అందుగల క్రూర రాక్షసులను  తన  సాటిలేని శార్ఙ్గమను విల్లుచే  అద్వితీయమైన బాణములను ప్రయోగించి   భస్మీపటలముచేసినవాడును,   ( ఇందు ఆళ్వార్ , తాను శరీరమనులంకలో బంధితుడై ,  బలిష్టములైన ఇంద్రియములచే బాధింపబడుచు,సర్వేశ్వరుని నుండి దూరమైయుండుటను సహించలేక సర్వేశ్వరుని రక్షించమని వేడుట ఈ స్తుతియందు ప్రస్పుటించును.)

    …                మూవడి నానిలమ్ వేణ్డి ,

    ముప్పురి నూలొడు మాన్ ఉరి యిలఙ్గు

    మార్వినిన్ , ఇరుప్పిఱప్పు ఒరు మాణాగి,

    ఒరు ముఱై యీరడి  మూవులగళణ్దనై ,

ఒరు ముఱై =ఒకానొక కాలమందు; ముప్పురి నూలొడు = యజ్ఞోపవీతముతోకూడి;మాన్ ఉరి కృష్ణాజినముతొ; యిలఙ్గు మార్వినిన్ = ప్రకాశించు వక్షస్థలముగల; ఇరుప్పిఱప్పు ఒరుమాణాగి = ఒక సాటిలేని బ్రాహ్మణ బ్రహ్మచారిగ అవతరించి; ( మహాబలి యొక్క యాగభూమివద్దకు వేంచేసి ) నానిలమ్ = నాలుగు విధములైన ప్రదేశములతో ఒప్పు  ( పర్వతములు , అడవులు , సముద్రములు , రాజ్యములతొ ఒప్పు) భూమిలో; మూవడి = మూడడుగుల నేలను; వేణ్డి = యాచించి; యీరడి = రెండు అడుగులు తన దివ్యపాదముచే; మూవులగు = మూడు లోకములను; అళన్దనై =కొలిచి స్వీకరించినవాడును;

ప్రయోజనాంతపరుడైన ఇంద్రుడు పోగొట్టుకొనిన రాజ్యాధిపత్యమునకై  ప్రార్ధింపగ సర్వేశ్వరుడు అతి సుందరమైన బ్రాహ్మణ బ్రహ్మచారిగ అవతరించి మహాబలి యొక్కయాగభూమివద్దకు వేంచేసి  అచట  చూపరులందరిని తన సౌందర్యముచే మంత్రముగ్ధులను చేసి, మహాబలినుండి మూడడుగుల నేలను యాచించి,  దానజలమును స్వీకరించిన వెంటనే   రెండు అడుగులు తన దివ్యపాదముచే మూడు లోకములను కొలిచి అశురప్రవృత్తిగల మహాబలిని తన సౌందర్యముతొ గెలిచిన వాడును,

( ఇందు ఇంద్రునివలెగాక ఆళ్వార్ తమ ఆత్మగుణరూపమునకు అనుగుణముగ సర్వేశ్వరుని కైంకర్యము ప్రసాదించమని విన్నవించుట ప్రస్పుటించును.)

నాల్ దిశై నడుఙ్గ , అఞ్జిరై ప్పఱవై

యేఱి , నాల్వాయ్ ముమ్మతత్తు ఇరు శెవి

ఒరు తని వేழత్తు అరన్దైయై , ఒరు నాళ్

ఇరు నీర్ మడువుళ్ తీర్తనై ,…..  …….

ఒరు నాళ్ = ఒకానొక కాలమందు; నాల్ దిశై నడుఙ్గ = అన్ని దిక్కులందున్న వారు  వణుకునట్లు (మిక్కిలి కోపావేశముతో );అమ్ శిఱై ప్పఱవై యేఱి = అందమైన రెక్కలగల గరుడాళ్వార్ పై ఎక్కి; ఇరు నీర్ మడువుళ్ = మిక్కిలి లోతైన నీరుగల మడుగుయందు; (గట్టుపై ఏతెంచి), నాల వాయ్ = వేలాడుచున్న నోరుగలదియు; ముమ్మతత్తు = మూడు శరీరబాగములనుండి మదజలము స్రవించుచుండునదియు,ఇరు శెవి = రెండు పెద్ద చెవులుగలదియు;(అయిన) ఒరు తని వేழత్తు = మిక్కిలి నిస్సహాయుడైన ,విలక్షణమైన , గజేంద్రాళ్వార్ యొక్క; అరన్దైయై = దుఃఖమును; తీర్తనై = పోగొట్టినవాడును;

సర్వేశ్వరుని ఆరాధించుటకు, తామరపూలకై మిక్కిలి లోతైన మడుగులో దిగిన గజేంద్రుడు ,క్రూరమైన మొసలి నోటికోరలలో చిక్కి, బహుకాలము పోరాడి, శక్తినశించి,” జగత్కారణభూతుడా! సర్వేశ్వరుడా! నీవే దిక్కు! నీవే శరణు! ” అని ఎలుగెత్తి పిలువుగ, కోపావేశముతో గరుడాళ్వార్ పై ఎక్కి, మడుగు గట్టుపై ఏతెంచి,గజేంద్రాళ్వార్ యొక్క దుఃఖమును  పోగొట్టినవాడును,

( ఇందు ఆళ్వార్, బలిష్టమైన ఇంద్రియములు పాలించు శరీరమున చిక్కిన తనను రక్షింపమని సర్వేశ్వరుని ఎలుగెత్తి వేడుకొనుట ప్రస్పుటించును.)

  ..     …       …. …       …..     ముత్తీ  

నాన్మఱై  ఐ వగై వేళ్వి,  అఱు తొழிల్

అన్దణర్ వణఙ్గుమ్ తన్మైయై , … …..

ముత్తీ = మూడు రకములైన అగ్నులును; నాల్ మఱై=నాలుగు వేదములును;ఐ వగై వేళ్వి = ఐదు రకములైన యఙ్ఞములును; అఱు తొழிల్ = ఆరు రకములైన కర్మములును (యజనమ్,యాజనమ్,అధ్యయనమ్,అధ్యాపనమ్,దానమ్,ప్రతిగ్రహమ్) అనుష్టించువారైన; అన్దణర్ = బ్రాహ్మణోత్తములచే;వణఙ్గుమ్ తన్మైయై = సేవింపబడు స్వభావముగలవాడును;

గార్హపద్యము, ఆహవనీయము,దక్షిణాగ్ని అనబడు త్రేతాగ్నులును నిర్వహించువారును, ఋగ్వేదము,యజుర్వేదము,సామవేదము,అధర్వణవేదము అనబడు నాలుగువేదములను  పఠించువారును,  తైత్తిరీయ ఉపనిషత్తుయందు చెప్పబడు దేవయఙ్ఞము, పితృయఙ్ఞము, భూతయఙ్ఞము,మనుష్యయఙ్ఞము, బ్రహ్మయఙ్ఞము ,  అను ఐదు యఙ్ఞములును సలుపువారును,(తమకై యఙ్ఞములను చేయుటను, పరులకై యఙ్ఞములను చేయుటను, తమకై వేదముననుసంధించుటను, పరులకై వేదపఠనము చేయుటను, తమకై దానము స్వీకరించుటను, పరులకు దానమొసంగుటను, అనబడు) ఆరు విధములైన కర్మములు ఆచరించువారును, అట్టి  బ్రాహ్మణోత్తములచే సేవింపబడు స్వభావముగలవాడును,

( కర్మయోగము,ఙ్ఞానయోగముల నిర్వాహకుడును,వేదములచే ప్రతిపాదింపబడు పరమజ్యోతి స్వరూపుడును అయిన సర్వేశ్వరుని  ఆళ్వార్ ఇచట  స్తుతించుచున్నారు.)

…      …..    ……      ఐమ్బులన్

అగత్తినుళ్ శెఱుత్తు ,  నాన్గుడనడక్కి

ముక్కుణత్తు ఇరణ్డవై అగర్ట్రి, ఒన్ఱినిల్

ఒన్ఱినిన్ఱు , ఆఙ్గిరుపిఱప్పఱుప్పోర్ 

        అరియుమ్ తన్మైయై,   … …. ……

ఐమ్బులన్ అగత్తినుళ్ శెఱుత్తు = పంచేంద్రియములను బాహ్యవిషయములందు సంచరించనీయక  మనస్సును నిరోధించి; నాన్గు ఉడన్ అడక్కి  = భుజించుట, నిద్ర, భయపడుట, విషయభోగము అనబడు నాలుగింటియందు ఆశక్తిని విసర్జించి; ముక్కుణత్తు = సత్వ,రజః తమో గుణముల మూడింటిలో; ఇరణ్డు అవై = రజస్సు,తమస్సు అను రెండు గుణములను, అగర్ట్రి = విడిచిపెట్టి; ఒన్ఱినిల్ = సత్వగుణమొక్కటిలోనే; ఒన్ఱినిన్ఱు = నిలిచియుండి; ఆఙ్గు = అట్టి యోగస్ధితియందు; ఇరు పిరప్పు అఱుప్పోర్ = పుణ్య,పాపకర్మములవలన అనాదికాలమునుండి వచ్చుచున్న సంసార దుఃఖములను పోగొట్టుకొను శక్తిగల మహానుభావులచే; అరియుమ్ తన్మైయై = తెలుసుకొనదగినస్వభావము గలవాడును;

పంచేంద్రియములను శబ్దాదివిషయములందు సంచరింపనీయక, ఆహార,నిద్రా విషయములందును , ఏ చేతలలో ఏ కీడు కలుగునో అను బయమునందును,విషయ భోగములందును , ఆశక్తి లేనట్టి జితేంద్రులైన సాత్విక మహానుభావులచే భక్తి యోగమార్గము ద్వారా  సాక్షాత్కారమును బడయువాడును,

( ఇందును,క్రింది చరణమునందును ఆళ్వార్ ” యోగవిదాంనేతా ” అను సర్వేశ్వరుని నామమును స్తుతించుట ప్రస్పుటించును.)

…     ….      ….    ముక్కణ్ నాల్ తోళ్

ఐవాయ్ అరవోడు , ఆఱుపొతి శడైయోన్

అఱివరుంతన్మై పెరుమైయుళ్ నిన్ఱనై ,

ముక్కణ్ = మూడు కన్నులు కలవాడును; నాల్ తోల్ = నాలుగు భుజములు కలవాడును; ఐ వాయ్ అరవోడు = ఐదు తలలుగల పాములతోడను; ఆఱుపొతి శడైయోన్=గంగానది అమరిన జటలుగల రుద్రునకు; అఱివు అరు = గ్రహింప శక్యము కాని;  తన్మై = స్వభావమను; పెరుమైయుళ్ = విఖ్యాతియందు; నిన్ఱనై = ప్రకాశించుచున్నవాడును;

మూడు కన్నులు కలవాడును, ఐదు తలలుగల పాములతొ నాలుగు భుజములు కలవాడును, గంగానదితో అమరిన జటలుగలవాడును,అయిన,మిక్కిలి ఙ్ఞానమునకును శక్తికిని ప్రతీకమయిన విశిష్టమైన రూపముకలిగిన రుద్రునిచే గ్రహింప శక్యము కానివాడును,

( ఇందు ఎంతటి శక్తి ,ఙ్ఞానము కలవాడైనను తన స్వయంకృషిచే  అనంతమైన కల్యాణగుణములతో వెలయు పరమజ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని గ్రహింప శక్యము కాదని ఆళ్వార్ వెల్లడించుచున్నారు.)

ఏழுలగెయిర్ట్రినిల్ కొణ్డనై , కూఱియ

అఱు శువై ప్పయనుమాయినై , శుడర్విడుం

ఐమ్బడై అఙ్గైయుళ్ అమర్ న్దనై , శున్దర

నాల్ తోళ్ మున్నీర్ వణ్ణ , నిన్ ఈరడి

ఒన్ఱియ మనత్తాల్ , ఒరు మది ముగత్తు 

మఙ్గైయర్ ఇరువరుం మలరన ,అఙ్గైయిన్

ముప్పొழுదుమ్ వరుడ అఱి తుయిలమర్ న్దనై ,

ఏழ் ఉలగు = సప్తద్వీపములు గల ఈ భూమండలమంతయును ; ఎయిర్ట్రినిల్ కొణ్డనై = (శ్రీవరాహరూపముదాల్చి) తన దంతములతో పెగళించి పైకెత్తినవాడును;  కూఱియ అఱు శువై ప్పయనుమ్ ఆయినై  =  ప్రసిద్ధముగ చెప్పబడు ఆరు రకములైన రసముల ప్రయోజనము తానే అయి ఒప్పువాడును; అమ్ కైయిల్ = అందమైన చేతులందు; శుడర్ విడుం ఐమ్ పడై =  మిక్కిలి తేజస్సుచేప్రకాశించు ఐదు ఆయుధములతో; అమర్ న్దనై = ఒప్పుచుండు వాడును; శున్దర నాల్ తోళ్=అందమైన నాలుగు భుజములు కలవాడును;మున్నీర్ వణ్ణ!=సముద్రము పోలిన తిరుమేనిగల సర్వేశ్వరుడును;నిన్ ఈర్ అడి=నీ యొక్క పాదద్వందములను; ఒన్ఱియ మనత్తాల్ = మిక్కిలి  ప్రేమభరితమైన మనస్సుతో;ఒరు మది ముగత్తు  ఇరువరుమ్ = విలక్షణమైన చంద్రుని పోలిన  ముఖమండలముగలశ్రీ మహాలక్ష్మి ,భూదేవి , ఇరువురును; మలరన అమ్  కైయిన్ =పుష్పమువలె అతి సుకుమారమైన అందమైన తమ చేతులతో; ముప్పొழுదుమ్ = ఎల్లప్పుడును; వరుడ=ఒత్తుచుండగ; అఱి తుయిల్ అమర్ న్దనై = (మిక్కిలి ప్రీతితో) యోగనిద్రయందు అమరి యుండువాడును;

 జంబు, ప్లక్ష , శాల్మల, కుశ , క్రౌంచ, శాక ,పుష్కర అనబడు సప్తద్వీపములు గల ఈ భూమండలమును హిరణ్యాక్షుని చేతిలో క్షతిపొందనీయక ,వరాహరూపముదాల్చి అండభిత్తినుండి  తన దంతములతో పైకెత్తి కృపతో రక్షించినవాడును, శాస్త్రములందు చెప్పబడు తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు షడ్రుచులతోనుండు ఆహారము వలె భోగ్యుడును, ఆశ్రితుల సంరక్షణార్ధమై శంఖము, చక్రము, గద, శార్ఙ్గము, నందకము అనబడు మిక్కిలి తేజస్సుచేప్రకాశించు ఐదు ఆయుధములను ధరించినవాడును,  అందమైన నాలుగు భుజములు కలవాడును, నదులనీరు,ఊటనీరు, వర్షపునీరు అనబడు మూడు రకములనీటితోఒప్పు సముద్రమువలె నీలివర్ణపు తిరుమేనితో మిక్కిలి ఆహ్లాదకరముగనుండువాడును, వెన్నెల వెదజల్లుచుండు చంద్రుని పోలిన ముఖమండలముగల శ్రీమహాలక్ష్మి, భూదేవి, ఇరువురును పుష్పమువలె అతి సుకుమారమైన అందమైన తమ చేతులతో ఎల్లప్పుడును ఒత్తుచుండగ, మిక్కిలి ప్రీతితో యోగనిద్రయందు అమరి యుండువాడును,

(ఇందు ఆళ్వార్ సర్వేశ్వరుని నిర్హేతుకకృపయు ,రక్షకత్వము, తిరుమేని సౌందర్యము, మొదలగు కళ్యాణ గుణములను, వాటిని ఇనుమడింపజేయు శ్రీ దేవి, భూదేవి పట్టమహిషీమణులను స్తుతించుచున్నారు.)

నెఱిముఱై నాల్ వగై వరుణముమాయినై ,

మేతగుమ్ ఐమ్ పెరుమ్ పూతముమ్ నీయే ,

అఱుపత మురలుం కూన్దల్ కారణమ్ ,

ఏழ்విడై యడఙ్గ శెర్ట్రనై , అఱువగై

  చ్చమయముమ్ అఱివరు నిలైయినై , ఐమ్ పాల్

ఓతియై ఆగత్తిరుత్తినై , అఱముదల్

నాన్గవైయాయ్ మూర్తిమూన్ఱాయ్ ,

ఇరువగై ప్పయనాయ్ ఒన్ఱాయ్ విరిన్దు

నిన్ఱనై , …..     ……     ….    ………

నెఱిముఱై = శాస్త్రములో చెప్పబడు; నాల్ వగై వరుణముమ్ ఆయినై = నాలుగు జాతుల యొక్క ధర్మములకు నిర్వాహకుడును; మే తగుమ్ ఐమ్ పెరుమ్ పూతముమ్ నీయే=(ఆత్మలు)ప్రవేశించి నివసింప తగినట్లు పంచమహాభూతముల నిర్వాహకుడును; అఱు పదమ్ మురలుం కూన్దల్ కారణమ్=ఆరు కాళ్ళుగల తేనెటీగలు (వచ్చిమదుపానము చేసి) ఝంకారము చేయు కుంతలములుగల నప్పిన్నైపిరాట్టి కొఱకు;ఏழ்విడై = ఏడు వృషభములను; అడఙ్గ శెర్ట్రనై = అణగద్రొక్కి చంపినవాడును; అఱువగై శమయముమ్ = ఆరు రకములైన ఇతర మతములకు చెందినవారిచే; అఱివరు నిలైయినై=గ్రహింప శక్యము కాని స్వభావముగలవాడును; ఐమ్ పాల్ ఓతియై = (మృదుత్వము,నల్లదనము, పరిమళము, గిరజములు,దట్టముగనుండుట అను) ఐదు మంచి  లక్షణములతో కూడిన కుంతలములు గల శ్రీదేవిని; ఆగత్తు ఇరుత్తినై = తన వక్షస్థలమందు నిత్యముగ ఉంచుకొనిన వాడును, అఱమ్ ముదల్ నాన్గు అవైయాయ్ =ధర్మము , అర్థము, కామము , మోక్షము మొదలగు నాలుగు పురుషార్ధములను ఒసగువాడును; మూర్తిమూన్ఱాయ్ = త్రిమూర్తులకు అంతర్యామియై నుండువాడును;ఇరువగై ప్పయనాయ్=సుఖ,దుఃఖముల రెండింటికిని నిర్వాహకుడును; ఒన్ఱాయ్ విరిన్దు నిన్ఱనై=తాను అద్వితీయుడైయుండి మఱియు లోకములందంతటను వ్యాపించి అంతర్యామియై నుండువాడును; 

 విరాట్ పురుషుడైన సర్వేశ్వరుని ముఖమునుండి బ్రాహ్మణులు, భుజములనుండి  క్షత్రీయులు,తొడలనుండి వైశ్యులు,పాదములనుండి శూద్రులు ఉద్భవించిన నాలుగు వర్ణములవారికి వారి వారి విధులననుసరించి ముక్తినొసగువాడును, ఆత్మలు తమ తమ కర్మలనుసరించి ప్రవేశించుటకు తగినట్లు అగ్ని, జలము, భూమి, వాయువు, ఆకాశము అనబడు పంచభూతములకు నిర్వాహకుడును,అందమైన నప్పిన్నైపిరాట్టి లబ్ధికై బలిష్టమైన ఏడు వృషభములను అవలీలగా వధించిన వాడును,   బాహ్యమతస్థులచే   గ్రహింప శక్యము కాని స్వభావముగలవాడును ,శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలమందు గలవాడును, ధర్మము , అర్థము, కామము,  మోక్షము మొదలగు నాలుగు పురుషార్ధములను ఒసగువాడును, సుఖ,దుఃఖముల రెండింటికిని నిర్వాహకుడును, తాను అద్వితీయుడైయుండి  లోకములందంతటను వ్యాపించి అంతర్యామియై నుండువాడును,

(ఇందు ఆళ్వార్ సర్వేశ్వరుని సర్వవ్యాపకత్వమును, రక్షకత్వమును, కారణత్వమును, స్తుతించుచున్నారు.)

…..     ….  .  కున్ఱా మదు మలర్ శోలై

వణ్ కొడి ప్పడప్పై , వరు పునల్  పొన్ని

మామణి యలైక్కుమ్ , శెన్నల్ ఒణ్ కழని

తిగழ் వనమ్ ఉడుత్త , కఱ్పోర్ పురిశై

కనకమాళికై , నిమిర్ కొడి విశుమ్బిల్ 

ఇళమ్ పిఱై తువక్కుం , శెల్వం మల్గు తెన్

తిరుక్కుడన్దై , అన్దణర్ మన్దిరమొழிయుడన్ 

వణఙ్గ , ఆడరవు అమళియిల్ అఱితుయిల్

అమర్ న్ద పరమ , నిన్నడియిణై పణివన్

వరుమ్ ఇడర్ అగల మార్ట్రో వినైయే ,

కున్ఱా మదు=తరగని తేనెతో నిండిన; మలర్ శోలై = మిక్కుటముగ  పుష్పములగల తోటలు గలదియు; వణ్ కొడి ప్పడప్పై=అందమైన తీగపాదులుగల వనములు గలదియును; వరు పునల్=ఎప్పుడును ప్రవహించుచుండు నీరుగల; పొన్ని=కావేరి నది; మా మణి = శ్లాఘ్యమైన రత్నములను; అలైక్కుమ్= అలలచే అమితముగ చేర్చబడుచుండునదియు; శెన్నల్ ఒణ్ కழని = అందమైన ఎర్రని ధాన్యపుపంటలుగల పొలములు కలిగినదియు; తిగழ் వనమ్ ఉడుత్త = నలుప్రక్కల సుందరమైన వనములతో కూడియున్నదియు; కఱ్పోర్ పురిశై = విద్వాంసులు నివసించుచున్న నగరమును; కనక మాళికై  నిమిర్  = బంగారు మండపములనుండి పైకెగిరుచున్న; కొడి = ధ్వజములు; విశుమ్బిల్ = ఆకాశమందు; ఇళమ్ పిఱై = బాలచంద్రుని; తువక్కుం  = స్పర్శించుచున్నవియు; శెల్వం మల్గు = సిరిసంపదలుగల; తెన్ తిరుక్కుడన్దై=సుందరమైన తిరు కుడందై దివ్య దేశములో; అన్దణర్=బ్రాహ్మణోత్తములు;మన్దిరమొழிయుడన్ వణఙ్గ  = వేద మంత్రములను పఠించుచు సేవించుటకు అనుగుణముగ ,ఆడు అరవు అమళియిల్ = పడగలెత్తి ఆడుచుండు ఆదిశేషుని తల్పమున, అఱి తుయిల్ అమర్ న్ద = యోగనిద్రయందు అమరియున్న; పరమ = సర్వేశ్వరుడా! వరుమ్ ఇడర్ అగల = నీ చెంత చేరుటకు ప్రతిబంధకములైన ఈ సంసారబందముల వలన కలిగెడి దుఃఖముల పోవునట్లు;నిన్ అడియిణై పణివన్ =  నీ దివ్య పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను; వినై = నాయొక్క పాపసమూహములను , మార్ట్రో = తొలగింపజేయుమా నాస్వామీ!

(ఇచట ఆళ్వార్ సర్వేశ్వరుని సృష్టికారణత్వము మొదలుకొని అతని రక్షకత్వము,స్వరూపము,  కల్యాణగుణములు స్తుతించుచు అట్టి స్వామిని , తిరుక్కుడందై దివ్యదేశములో కృపతో వేంచేసిన ఆరావముద పెరుమాళ్ ను దర్శించి, వాని  దివ్య చరణములయందు  మిక్కిలి ఆర్తితో శరణుజొచ్చుచున్నారు.) 

తేనెలతో నిండిన   పుష్పములుగల తోటలతోను, అందమైన తీగపాదులుగల వనములతోను, చుట్టబడినదియు, కావేరి నది ప్రవాహముచే శ్లాఘ్యమైన రత్నములు చేర్చబడుచుండునదియు, జలసమృద్ధిచే ఎఱ్ఱ ధాన్యపు పంటలుగల పొలములతో చుట్టుకొని యున్నదియు, ఉన్నతమైన భవనములతో వెలయుచున్నదియు, విద్వాంసులు నివసించుచున్న నగరముగ ఖ్యాతి పొందినదియు, అట్టి సిరిసంపదలతో తులతూగుచున్న సుందరమైన తిరు కుడందై దివ్య దేశములో, బ్రాహ్మణోత్తములు పురుషసూక్తము మొదలగు వేద మంత్రములను పఠించుచు సేవించుటకు అనుగుణముగ ఆదిశేషుని తల్పమున యోగనిద్రయందు అమరియున్నసర్వేశ్వరుడా! నీ దివ్య పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను. ఈ సంసార దుఃఖములను నివర్తించి, నీ కైంకర్యమును  కృపచేయుమా!(అని ఆళ్వార్ మిక్కిలి ఆర్తితో విన్నవించుకొనుచున్నారు.) 

( కవి కమ్బర్ , తిరుమంగై ఆళ్వార్ వైభవమును స్తుతించిన  పాశురమును తిరువెழுకూర్ట్రిరుక్కై ప్రబంధాంతమందు పఠనము  చేయబడును.)

ఇడఙ్గొణ్డ నెఞ్జత్తిణఙ్గి క్కిడప్పన , ఎన్ఱుమ్ పొన్ని 

తడఙ్గొణ్డ తామరై శూழுమ్ మలర్ న్ద తణ్ పూమ్ కుడన్దై ,

విడఙ్గొణ్డ వెణ్ పల్ కరుమ్ తుత్తి శెఙ్గణ్ తయలుమిழ் వాయ్

పడఙ్గొణ్డ పామ్బణై ప్పళ్ళికొణ్డాన్ తిరుప్పాదఙ్గళే ll

పొన్ని=కావేరి నది చేతను; తామరై కొణ్డ తడమ్=తామరపుష్పములచే నిండియున్న కొలనులచేతను; శూழுమ్ = చుట్టుకొనియుండునట్టి, మలర్ న్ద తణ్ పూమ్ కుడన్దై =వికసించిన పుష్పములు, చల్లదనముతో అలరారు తిరు కుడందై దివ్య దేశములో;  విడఙ్గొణ్డ వెణ్ పల్ =  (అశురులను, రాక్షసులను కరిచి చంపుటకై)విషముతొనుండు తెల్లని కోరలు గలదియు; కరుమ్ తుత్తి = నల్లని చిహ్నములుండు పడగలు కలదియు; శెఙ్గణ్ (అశురులపై ఆగ్రహించుటచే) ఎఱ్ఱని నేత్రములుగలదియు; తయలుమిழ்వాయ్= (శత్రువులు దరిచేరకుండనటుల) నోటినుండి అగ్నిజ్వాలలు గ్రక్కుచుండునదియు; (అట్టి), పడఙ్గొణ్డ పామ్బణై = పడగల విప్పియున్న శేషతల్పముపై, ప్పళ్ళికొణ్డాన్ = పవళించియున్న ఆరావముదు పెరుమాళ్ యొక్క; తిరుప్పాదఙ్గళే = దివ్య చరణారవిందములే  ; ఎన్ఱుమ్ = ఎల్లప్పుడును; నెఞ్జిత్తు ఇడఙ్గొణ్డ ఇణఙ్గి క్కిడప్పన= (తిరుమంగై ఆళ్వార్) హృదయాంతరాళమందు పదిలముగ అమరియున్నది.

కావేరి నది చేతను, తామర కొలనులచేతను చుట్టుకొనియుండునట్టి మిక్కిలి మనోహరమైన తిరు కుడందై దివ్య దేశములో,శత్రువులు దరిచేరకుండనటుల భయంకరస్వరూపముతో  పడగల విప్పియున్న శేషతల్పముపై పవళించియున్న ఆరావముదు పెరుమాళ్ యొక్క దివ్య చరణారవిందములే ఎల్లప్పుడును తిరుమంగై ఆళ్వార్ హృదయాంతరాళమందు పదిలముగ అమరియున్నది.

తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం 
  *********

వ్యాఖ్యానించండి